
పోలీసు శాఖలో మినీ ఫాల్కన్ వాహనం
– పల్లెల్లో శాంతిభద్రతల కోసం వినియోగం
చిత్తూరు అర్బన్: శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా పోలీసు శాఖలో మినీ ఫాల్కన్ వాహనం అందుబాటులోకి తీసుకొచ్చారు. గురువారం చిత్తూరులోని ఆర్ముడు రిజర్వు కార్యాలయంలో ఎస్పీ మణికంఠ దీన్ని ప్రారంభించారు. వి.కోటకు చెందిన అమాక్ట్స్ సంస్థ చైర్మన్ జీ.దశరథరెడ్డి ఆర్థిక సహాయంతో దీన్ని రూపొందినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పోలీసుశాఖ వద్ద ఉన్న ఫాల్కన్ బస్సుతో బ్రహ్మోత్సవాలు, ప్రముఖుల పర్యటన, పట్టణాలు, నగరాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ చూస్తున్నామన్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై బస్సు వెళ్లడం కొన్ని సమయాల్లో సాధ్యం కాదన్నారు. దీంతో తమ వద్ద ఉన్న ఓ వాహనానికి కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం జోడించి మినీ ఫాల్కన్ వాహనంగా తయారు చేశామన్నారు. దీంతో గ్రామాల్లో శాంతి భద్రతలను పర్యవేక్షించడం సలువుగా ఉంటుందన్నారు. ఏఎస్పీలు రాజశేఖర్‌రాజు, శివానంద కిషోర్, డీఎస్పీ సాయినాథ్, పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, సీఐలు మహేశ్వర, నెట్టికంటయ్య పాల్గొన్నారు.