
విత్తు..చిత్తు!
కేవలం 3వేల హెక్టార్లకే పరిమితం
సకాలంలో అందని విత్తనకాయలు
కూటమి నేతల పెత్తనంతో రైతన్న కుదేలు
అన్నదాతలకు చేరింది 6వేల క్వింటాళ్లు
దారి మళ్లింది 24వేల క్వింటాళ్లు
అధికారుల తీరుపై వెల్లువెత్తిన విమర్శలు
ఇష్టారాజ్యంగా పంపిణీ
జిల్లాకు చేరిన వేరుశనగ విత్తనాలు (ఫైల్)
కూటమి నేతల అవినీతికి వేరుశనగ విత్తనం మొలకెత్తకుండానే చిత్తయ్యింది. పొలాలకు చేరకుండానే పక్కదారి పట్టింది. పచ్చమూక కాసుల కక్కుర్తికి రైతాంగం కుదేలైంది. అరకొరగా కాయలు అందడంతో సాగుబడి దారుణంగా పడిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. అయితే అధికార యంత్రాంగం మాత్రం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు కుంటి సాకులు చెబుతోంది. వరుణుడిపై నెపం నెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకుల అక్రమార్జనకు సహకారం అందిస్తోంది. ఆరుగాలం కష్టించే రైతన్నను నిలువునా మోసం చేస్తోంది.
కాణిపాకం : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వేరుశనగ సాగు పూర్తిగా పడిపోయింది. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సాధారణ సాగు విస్తీర్ణం 80వేల హెక్టార్లు అయితే వేరుశనగ పంట విస్తీర్ణం 35,238 హెక్టార్లుగా అధికారులు లెక్క కట్టారు. అయితే ప్రస్తుతం కేవలం 3,652 హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ తప్పిదాలతో పాటు.. క్షేత్రస్థాయిలో కూటమి నేతల పెత్తనం, అధికారుల పనితీరులో లోటుపాట్లే కారణమవుతోంది. సకాలంలో అన్నదాత సుఖీభవ నగదు జమ చేయకపోవడంతో రైతులు పెట్టుబడి ఖర్చులు భరించలేని పరిస్థితి ఏర్పడింది. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయం (రైతు భరోసా) అందించేది. విత్తనకాయలు సైతం అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేది. ప్రస్తుత సర్కారు ఈ విషయంలో అలసత్వం వహించడంతో వేరుశనగ రైతులకు అవస్థలు తప్పలేదు.
తోడైన తోతాపురి కష్టాలు!
వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసే సమయానికి అధిక సంఖ్యలో రైతులు తోతాపురి మామిడి ధరలతో కుస్తీపడుతున్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. దాదాపు నెలపాటు ఈ అవస్థలతో రోడ్డు మీద పడిపోయారు. దీంతో వేరుశనగ విత్తనాల కొనుగోలుకు దూరమయ్యారు. ఇదే అదునుగా కూటమి నేతలు రాయితీ విత్తనాలను యథేచ్ఛగా స్వాహా చేసేశారు.
24వేల క్వింటాళ్లు హాంఫట్..?
ప్రభుత్వం సరఫరా చేసిన కాయలకు.. జిల్లాలో వేరుశనగ విత్తుకు పొంతన కుదరని పరిస్థితి. జిల్లాకు వచ్చిన 30,283 క్వింటాళ్ల కాయలను దాదాపు 20వేల హెక్టార్లలో విత్తుకోవచ్చు. అయితే అందులో నాలుగో వంతు గింజలు కూడా భూమిలో పడలేదు. కేవలం 3,652 హెక్టార్లలో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. ఈ లెక్కన హెక్టారుకు 1.5 క్వింటాళ్ల కాయలను విత్తితే సుమారు 6వేల క్వింటాళ్లు మాత్రమే సరిపతాయి. మిగిలిన దాదాపు 24వేల క్వింటాళ్లు ఏమయ్యాయో వ్యవసాయశాఖ అధికారులే చెప్పాల్సి ఉంది. వేల క్వింటాళ్లను కూటమి నేతల పరం చేశారా..? లేకుంటే వంట నూనెకు వాడేశారా..? ఇంతకీ కాయలు తీసుకున్న వారందరూ రైతులేనా..? నిజంగా రైతులకే విత్తనాలు ఇచ్చుంటే.. వేరుశనగ సాగు విస్తీర్ణం ఈ స్థాయిలో ఎందుకు పడిపోయిందో లెక్కలు చెప్పాల్సిన అవసరముంది. పైగా వేరుశనగ కాయలు విక్రయించిన నగదును ప్రభుత్వానికి జమ చేయకుండా తొలుత రూ.కోటి వరకు బకాయి ఎందుకు పెట్టారో వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికీ అందులో రూ.25లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా సమాచారం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో.. విత్తనాల సరఫరా
సంవత్సరం క్వింటాళ్లు
2022 42,288
2023 41,070.3
2024 42,202.5
కూటమి సర్కారులో..
2025 30,283
వర్షపాతం వివరాలు
నెల సాధారణం మి.మీలో కురిసింది మి.మీలో
జూన్ 80.09 38.7
జూలై 103.05 96.04
ఆగస్ట్ 121.02 242.2
జిల్లాలో తగ్గిన వేరుశనగ సాగు
ఈ ఏడాది రాయితీ వేరుశనగ విత్తనాలు రైతు సేవా కేంద్రాలు, సొసైటీ, పంచాయతీ భవనాలకు చేరేలోపు.. కూటమి నేతలు చేజిక్కించుకున్నారు. విత్తనాల కొనుగోలు టోకెన్లను కై వసం చేసుకున్నారు. కాయల పంపిణీపై పెత్తనం మొదలుపెట్టారు. ఇష్టారాజ్యంగా విత్తనాలను పంచిపెట్టారు. దీంతో నిజమైన రైతులకు మాత్రం సక్రంగా కాయలు అందలేదు. ఈ క్రమంలో వేరుశనగ విత్తనం పూర్తిస్థాయిలో పొలాలకు చేరని పరిస్థితి ఏర్పడింది.
కుంటి సాకులు
వేరుశనగ విత్తుకునేందుకు సకాలంలో వర్షాలు కురవలేదని, అందువల్లే సాగుబడి తగ్గిపోయిందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై రైతులు మండిపడుతున్నారు. అదును తగినట్టు వర్షాలు పడ్డాయని, ప్రభుత్వం, కూటమి నేతలు, అధికారుల నిర్వాకం కారణంగా వేరుశనగ సాగు పడిపోయిందని ఆరోపిస్తున్నారు. చేసిందంతా చేసేసి ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సకాలంలో పెట్టుబడిసాయం, రాయితీ విత్తనాలు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని వాపోతున్నారు.
అరకొరగా కాయలు
ప్రభుత్వం జిల్లాకు అరకొరగా విత్తన కాయలు సరఫరా చేసింది. తొలుత 26,350 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో అదనపు కేటాయింపులతో కలిపి మొత్తం 30,283 క్వింటాళ్లు సరఫరా చేసింది. ఈ క్రమంలో రైతులకు ఒక్కో బ్యాగు చొప్పున విత్తన కాయలు అందించేందుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇదే సమయంలో కూటమి నేతలు రంగంలోకి దిగారు. అధికారులతో కుమ్మౖక్కై ప్రణాళికలను తారుమారు చేసేశారు.

విత్తు..చిత్తు!

విత్తు..చిత్తు!