
అన్నదాతలకు అండగా..
సాక్షి ప్రతినిధి, తిరుపతి : అన్నదాతలకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సిద్ధమైంది. కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించింది. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 9న తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టనుంది. ఆ మేరకు బుధవారం తిరుపతిలోని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో పార్టీ తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రులు నారాయణస్వామి, ఆర్‌కే రోజా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, తిరుపతి నగర మేయర్ శిరీష, సమన్వయకర్తలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, భూమన అభినయరెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, వెంకటేగౌడ్, నూకతోటి రాజేష్, కృపాలక్ష్మి, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రవర్మ, తిరుపతి అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి సమావేశమయ్యారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మామిడి దిగుబడులకు గుజ్జు పరిశ్రమల వారు కిలో మామిడికి రూ.8, ప్రభుత్వం రూ.4 చెల్లించాల్సి ఉంది. కాయలు విక్రయించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పైసా చెల్లించకపోవడంపై మండిపడ్డారు. ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవటం, యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. రైతు సమస్యల పరిష్కారం ఈనెల 9న ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పలమనేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెంకటేగౌడ్, శ్రీకాళహస్తిలో భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నగరిలో ఆర్‌కే రోజా, కృపాలక్ష్మి, చిత్తూరులో నారాయణస్వామి, డాక్టర్ సునీల్‌కుమార్, కుప్పంలో రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, తిరుపతిలో భూమన అభినయరెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.