
అలసి.. సొలసి!
ఏమార్చి సంతకం చేయించుకుంటున్న అధికారులు
సమస్య పరిష్కరించేశామంటూ
తప్పుడు నివేదికలు
పలుకుబడి ఉంటేనే పరిష్కరిస్తున్నారంటున్న అర్జీదారులు
గత ప్రభుత్వంలో అర్జీలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పర్యవేక్షణ లేమి.. పాలకుల ఉదాసీనత వెరసి గ్రీవెన్స్ తూతూమంత్రంగా నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది. అర్జీదారులు గత ప్రభుత్వం మాదిరిగా సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టరేట్‌తోపాటు మండల కేంద్రాలకు క్యూ కడుతున్నారు. నెలల తరబడి అర్జీలిస్తూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కానీ ఏం లాభం..?. అధికారులు స్పందించక.. సమస్య పరిష్కారంగాక.. ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తో పాటు, ఆర్డీవో, నగరపాలక, మున్సిపల్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ (ప్రజాసమస్యల పరిష్కార వేదిక)ను ప్రతి సోమవారం నిర్వహిస్తున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అర్జీదారులకు న్యాయం జరగడం లేదు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల సమస్యలను త్వరతిగతిన పరిష్కరించాలని పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్ర స్థాయి అధికారులకు చలనం లేకుండా పోతోంది. ఫలితంగా అర్జీదారులు న్యాయం కోసం పదేపదే పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు ఇస్తూనే ఉన్నారు.
ఏమార్చి.. సంతకాలు చేయించుకుని
పీజీఆర్‌ఎస్‌లో నమోదైన అర్జీ పరిష్కారానికి సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఎవరికై తే న్యాయం జరగాలో వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని పలు మండలాల్లో అలా జరగడం లేదు. ఉన్నతాధికారుల నుంచి అందే అర్జీలను సకాలంలో పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు అర్జీదారుల నుంచి తెల్లకాగితంలో సంతకం చేయించుకుని సమస్య పరిష్కరించినట్లు ఏమారుస్తున్నారు.
పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేస్తున్న ప్రజలు
తొమ్మిది సార్లు అర్జీలందజేసినా..
సొంత గృహాల కోసం గంగాధరనెల్లూరు మండలం, కొత్తూరు ఎస్టీ కాలనీ వాసులు ఇప్పటికి 9 సార్లు పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీ నుంచి గత నెల వరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తొమ్మిది సార్లు అర్జీలు అందజేశారు. సంవత్సరాల తరబడి పూరి గుడిసెల్లో ఉంటున్నామని, 14 కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరు చేయాలని అర్జీ పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు వారి న్యాయం జరగలేదు.
పది సార్లు అర్జీ ఇచ్చినా..
కబ్జాదారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని పెనుమూరు మండలం, కంబాల చేను గ్రామస్తులు ఇప్పటికి పది సార్లు అర్జీ ఇచ్చినా పురోగతి శూన్యం. ఆ గ్రామంలోని 902 సర్వే నం.1.78 ఎకరాలు రాస్తా, సర్వే నం.985లో 44 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. మండల రెవెన్యూ అధికారులు తూతూమంత్రంగా ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
చెరువు కాలువను
ఆక్రమించారన్నా..
చెరువు కాలువను ఆక్రమించారని ఐరాల మండలానికి చెందిన బాబు మే 5న పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. అంతకుముందు ఐదు సార్లు మండలాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. కొందరు స్వార్థపరులు చెరువు కాలువను ఆక్రమించుకుని పొలానికి దారిలేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు క్షేత్రస్థాయి అధికారులకు వెళ్లింది. సమస్యను పరిష్కరించకుండా అర్జీని పరిష్కరించేశామంటూ అధికారులకు నివేదికిచ్చారు. ఇప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
ఏడు సార్లు అర్జీ ఇచ్చినా..
ఇప్పటికీ పీజీఆర్‌ఎస్‌లో ఏడు సార్లు అర్జీ ఇచ్చినా పరిష్కారం శూన్యం. పెనుమూరు మండలానికి చెందిన నాగభూషణం తమ ఇంటికి వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని, న్యాయం చేయాలంటూ మే 5వ తేదీన పీజీఆర్‌ఎస్‌లో అర్జీ ఇచ్చారు. అంతకుముందు ఆరు సార్లు మండల స్థాయిలో అధికారులకు అర్జీ అందజేశారు. సర్వే నం.467/1ఏలోని 20 సెంట్ల భూమిలో గత 30 ఏళ్లుగా నివసిస్తున్నట్లు నాగభూషణం అర్జీలో పేర్కొన్నారు. సంబంధిత స్థలంలో తమ ఇంటికి వెళ్లే దారి సర్వే నం.468/1లో కుంటపోరంబోకు స్థలం ఉందని, గత 30 ఏళ్లుగా ఆ దారినే వినియోగించుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆ దారిని మరొకరు ఆక్రమించుకోవడంతో పలుమార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా న్యాయం జరగని దుస్థితి.
కార్యాలయాలకే పిలిపించుకుని!
పీజీఆర్‌ఎస్‌లో అధిక శాతం రెవెన్యూ సమస్యలే నమోదవుతున్నాయి. ఆ సమస్యలను సంబంధిత తహసీల్దార్లు సకాలంలో పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో పలు చోట్ల ఆస్తి తగాదాలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువై ఒకరినొకరు చంపుకునే స్థాయికి వస్తున్నారు. రెవెన్యూ సమస్యలను క్షేత్ర స్థాయిలోకి వెళ్లి పరిశీలించి పరిష్కరించకుండా అర్జీదారులను కార్యాలయాలకు పిలిపించుకుంటున్నారు. ఆపై అర్జీదారులకు మాయ మాటలు చెప్పి సంతకాలు చేయించుకుని పంపించేస్తున్నారు. అధికారుల తీరు వల్ల రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నట్టు తెలుస్తోంది.
అర్జీల పరిష్కారం
అంతంతమాత్రమే

అలసి.. సొలసి!

అలసి.. సొలసి!

అలసి.. సొలసి!

అలసి.. సొలసి!

అలసి.. సొలసి!