విషం చిమ్ముతున్న ఆహార పరిశ్రమ | - | Sakshi
Sakshi News home page

విషం చిమ్ముతున్న ఆహార పరిశ్రమ

Sep 3 2025 4:29 AM | Updated on Sep 3 2025 4:29 AM

విషం చిమ్ముతున్న ఆహార పరిశ్రమ

విషం చిమ్ముతున్న ఆహార పరిశ్రమ

బుడ్డారెడ్డి కుంట వంకలోకి

రసాయన వ్యర్థాలు

ఆ ప్రాంతమంతా ఘాటైన వాసన

కలుషిత నీరు కనిపించకుండా చెక్‌ డ్యాం ధ్వంసం

స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

శాంతిపురం: తమ గ్రామం వద్ద పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆశించిన రెడ్డివారిపల్లి వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పరిశ్రమ నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం వారిని ఆవేదనకు గురిచేస్తోంది.

రాళ్లబూదుగూరు పంచాయతీలోని రెడ్డివారిపల్లి వద్ద రెండు నెలల క్రితం ఓ ఆహార పరిశ్రమ ప్రారంభమైంది. కూరగాయలను నిల్వచేసి, ఎగుమతి చేసేలా ప్రాసెస్‌ చేసే ఈ పరిశ్రమ నుంచి రసాయనాలు కలిసిన నీరు విడుదలవుతోంది. ఈ నీరు వెళ్లేందుకు చిన్నపాటి కాలువ చేసి పరిశ్రమ పక్కనే ఉన్న బుడ్డారెడ్డి కుంట వంకలోకి వదిలిపెట్టారు. వంక మొత్తం మీద రసాయనాలు కలిసిన నీరు ప్రవహిస్తూ కర్ణాటక సరిహద్దులోని కొత్తచెరువులోకి వెళ్తోంది. వంకపై నిర్మించిన నాలుగు చెక్‌ డ్యాంలు కూడా కలుషిత నీటితో నిండుతున్నాయి. దీంతో ఈ వంకలో కప్పలతో సహా ఇతర జీవరాశులేమీలేకుండా పోయాయి. వ్యర్థ నీటి నుంచి వస్తున్న ఘాటైన వాసనతో ఇబ్బందిగా ఉందని, పావు గంట ఉన్నా కళ్లల్లో నీరు కారుతూ ఊపిరి తీసుకోవడం కష్టమవుతోందని ఫ్యాక్టరీ పక్కన మైదానంలో క్రికెట్‌ ఆడే యువకులు పరిశ్రమ నిర్వాహకులకు తెలిపామన్నారు. దీంతో ఇటీవల ప్యాక్టరీ నిర్వాహకులు గుట్టుగా చెక్‌ డ్యాం గోడను పగులగొట్టి నీటిని కిందికి వదిలేయడంతో ఈ వ్యవహారాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా ప్రయోజనం లేకదని యువకులు వాపోతున్నారు. రసాయన నీరు వెళ్తున్న వంకకు ఇరువైపులా గడ్డి ఉన్న భూములు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో స్థానిక గ్రామాల వారు తమ ఆవులు, జీవాలను మేపుతుంటారు. అవి పొరబాటున వంకలో నీరు తాగితే తమకు జీవనాధారంగా ఉన్న పెంపుడు జంతువులు బలవువడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమను నడుపుతున్న బడాబాబులను అడ్డుకునే శక్తి తమకు లేదని వాపోతున్నారు. దీనిపై పరిశ్రమ నిర్వాహకుల వివరణ కోసం ప్రయత్నించగా వినాయకచవితి పండుగకు వెళ్లిన సార్లు ఎవ్వరూ ఇంకా రాలేదని, వాళ్ల ఫోన్‌ నంబర్లు ఇవ్వలేమని సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement