
13న జాతీయ లోక్‌అదాలత్
చిత్తూరు లీగల్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈనెల 13వ తేదీన జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ ప్రిన్స్‌పల్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. సోమవారం చిత్తూరు న్యాయస్థానాల సముదాయంలోని జిల్లా న్యాయ సేవాసదన్ భవనంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పరిష్కారం కోసం జాతీయ అదాలత్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెన్‌బౌన్స్ ఇతర కేసులను అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు. కక్షిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే చిత్తూరు కోర్టులో డీఎల్‌ఎస్‌ఏ భవనంలో సంప్రదించాలని కోరారు. కాగా జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో 96,647 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
చిత్తూరులో వ్యక్తి ఆత్మహత్య
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మోహన్ (43) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సీఐ మహేశ్వర కథనం మేరకు.. నగరంలోని కట్టమంచికి చెందిన మోహన్‌కు పెళ్లయ్యి పిల్లలున్నారు. అనారోగ్యం కారణంగా మద్యానికి బానిసయ్యాడు. భార్య కూడా గత కొంతకాలంగా ఇతనికి దూరంగా ఉంటోంది. సోమవారం కట్టమంచి–తిరుపతి రోడ్డులోని బ్రిడ్జి కింద ఉన్న పొలాల్లో ఓ చెట్టుకు పంచెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. పోలీసులకు ఆలస్యంగా సమాచారం అందడంతో మృతదేహాన్ని పరిశీలించి, చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఖననం చేసిన మృతదేహానికి పోస్టుమార్టం
యాదమరి: ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం.. శ్రీరంగరాజపురం మండలం, పాతపాళ్యం దళితవాడకు చెందిన రమేష్ కుమార్తె పూజ(25)ను యాదమరి మండలం, వరదరాజులపల్లికి చెందిన పెరియస్వామి కుమారుడు శేఖర్(33)కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అయితే శేఖర్ కుటుంబ సమస్యల వల్ల ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం పూజ దినసరి కూలీగా మారిపోయింది. గత నెల ఆడి కృత్తిక సందర్భంగా కావడి ఎత్తడానికి తన పుట్టింటికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి తల్లి వరదరాజులపల్లిలోని పూజ అత్తవారికి, బంధువులకు సమాచారం అందించింది. దీంతో వారు పూజ మృతదేహాన్ని వరదరాజులపల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లి రాధమ్మ రెండు రోజుల క్రితం ఎస్‌ఆర్‌పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ సుమన్ మంగళవారం వరదరాజులపల్లికి వచ్చి ఖననం చేసిన పూజ మృతదేహాన్ని స్థానిక తహసీల్దార్ పార్థసారథి సమక్షంలో చితూరు ప్రభుత్వాస్పత్రి పోస్టుమార్టం నిర్వహించారు. కాగా అక్కడి పోలీసులు వరదరాజులపల్లిలోని మృతురాలి బంధువులను విచారించినట్లు సమాచారం.