
ప్రాణం తీసిన ఫ్లెక్సీ
మరో ఇద్దరికి గాయాలు
ఇందులో ఒకరు మైనర్
చిత్తూరు అర్బన్: అనుకున్నట్లే అయ్యింది. చిత్తూరులో విచ్చల విడిగా విఫరీత ధోరణివైపు పరుగెడుతున్న ఫ్లెక్సీల సంస్కృతి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల ఫ్లెక్సీలను కడుతూ.. విద్యుత్ షాక్ తగలడంతో ఆనంద్ (19) అనే యువకుడు దుర్మరణంపాలయ్యాడు. చిత్తూరు నగరంలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం మేరకు.. చిత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం బుధవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. పలువురు టీడీపీ నేతలు నగరంలో విస్తృతంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చిత్తూరుతో పాటు తమిళనాడులోని వేలూరు నుంచి కూలీలను తీసుకొచ్చి ఫ్లెక్సీలు కట్టే బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో వేలూరు నగరం, ఆర్‌ఎస్.నగర్‌కు చెందిన ఆనంద్, పరశురామన్ (40), గోగుల్ (15), అనే ముగ్గురు చిత్తూరు హైరోడ్డులోని ఓ బ్యాంకు వద్ద భారీ ఫ్లెక్సీను ఏర్పాటు చేయడానికి పైకి ఎక్కారు. అక్కడే ఉన్న 33 కేవీ విద్యుత్ లైన్ ఫ్లెక్సీకి ఉన్న ఇనుప చువ్వను తాకింది. ఒక్కసారిగా విద్యుత్ ప్రవాహం ఇనుపచువ్వకు రావడంతో ముగ్గురూ ఎగిరి అవతలి వైపు పడ్డారు. ముగ్గుర్నీ స్థానికులు హుటాహుటిన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆనంద్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక పరశురామన్, గోగుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో గోగుల్ మైనర్ బాలుడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎవరిదీబాధ్యత?
ఆనంద్ మృతికి ఎవరు బాధ్యత వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. అనధికారికంగా నగరంలో ఫ్లెక్సీలు నింపేస్తున్న రాజకీయ పార్టీ నాయకులా..? ఫ్లెక్సీలు, బ్యానర్లను నియంత్రించాల్సిన కార్పొరేషన్ అధికారులా..? అనుమతిలేకుండా పెడుతున్న ఫ్లెక్సీలు గాలీవానకు నేలకొరుగుతుంటే కేసులు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న పోలీసులా..? అనే ప్రశ్నలు సామాన్యుల వైపు నుంచి వెల్లువెత్తుతున్నాయి.
టీడీపీ ఫ్లెక్సీ కడుతూ.. విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ప్రాణం తీసిన ఫ్లెక్సీ