
ఎగ్‌ఫీజు వేయాలంటే రూ.300 ఇవ్వాల్సిందే
చౌడేపల్లె: మండలంలో లైన్‌మెన్ల పనితీరు రోజురోజుకూ తీసికట్టుగా మారుతోంది. పర్యవేక్షణ లేమి.. ఉన్నతాధికారుల ఉదాసీనత కారణంగా తమ చేతికి పనిచెబుతున్నారు. ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని వారి చేత పనులు చేయిస్తూ రైతులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ఇక వారిసంగతి అంతే..! ఇలాంటిదే మండలంలోని కొండామర్రిలో వెలుగుచూసింది. మంగళవారం కోటూరు సమీపంలో ఓ రైతు బోరుకు సరఫరా చేసే ట్రాన్స్‌ఫార్మర్‌కు 11 కేవీ లైను వద్ద ఎగ్ ఫీజు కట్ అయ్యింది. ఆ రైతు లైన్‌మన్‌కు సమాచారమిచ్చారు. రూ.300 ఇస్తేనే వచ్చి ఎగ్‌ఫీజు వేస్తామని సంబంధిత లైన్‌మన్ రైతుకు బదిలిచ్చాడు. ససేమిరా అనడంతో ఆ రైతు లైన్‌మన్ అడిగినంత ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఓ ప్రయివేటు వ్యక్తి వచ్చి ఎగ్‌ఫీజు వేశాడు. అడిగినంత ఇవ్వకుంటే కన్నెత్తిచూడడని, ఫోన్ చేసినా స్పందించరని రైతు వాపోయాడు. మండలంలో మరికొన్ని చోట్ల రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ శిశధర్‌ను వివరణ కోరగా లైన్‌మన్‌కు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.