
ఆర్‌ఎంపీల వైద్యం..ప్రాణాలు పణం
స్థాయికి మించి వైద్య చికిత్సలు క్లినిక్, బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్ విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వినియోగం తూతూ మంత్రంగా పర్యవేక్షణ
ఇటీవల తమిళనాడు పళ్లిపట్టు సమీపం నివసించే 17 ఏళ్ల వయస్సుగల అమ్మాయి గర్భం దాల్చగా విజయపురం మండలం పన్నూరులో ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లగా అబార్షన్ చేశారు. కొన్నాళ్లకే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గంలో మృతి చెందింది. సంబంధిత ఆర్‌ఎంపీపై పళ్లిపట్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో నగరి మండలంలో గర్భస్రావం కోసం ఒక యువతి ఆర్‌ఎంపీని సంప్రదించింది. ఆ సమయంలో గర్భస్రావం చేయకూడదని తెలిసినా ఆర్‌ఎంపీ సూది మందు ఇవ్వడంతో అది వికటించింది. ఆపై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యంతో నూరేళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
విజయపురం : కొంత మంది ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని అంతకు మించి వైద్యం అందించకూడదని నిబంధనలు ఉన్నాయి. అయితే వాటిని ఎవరూ పాటించడం లేదు. వచ్చీరాని వైద్యంతో తెలిసీ తెలియని చికిత్సలతో ప్రాణాలను హరిస్తున్నారు. అన్ని వ్యాధులకు ఒకే మందు అన్నట్లు వచ్చిన ప్రతి బాధితుడికి ఓ రెండు రకాల సూది మందులు, ఎర్ర, పచ్చ, తెల్లది అంటూ మరో మూడు మాత్రలు ఇచ్చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేలు ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ఈ క్లినిక్‌లలో రోగులకు ప్రథమ చికిత్స చేసేందుకే పరిమితం కావాల్సిన ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ పరిధి దాటి వైద్యం చేస్తున్నారు. అర్హత లేకపోయినా క్లినిక్‌లు, బెడ్స్ ఏర్పాటు చేసి ట్రీట్‌మెంట్ చేస్తూ తమ ఇష్టం వచ్చినట్లుగా మందులు వాడుతూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరైతే ల్యాబ్, మెడికల్ షాప్స్ నిర్వహించడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. వీరి నిర్లక్ష్యంతో ఎక్కడో ఒక చోట బాధితులు ప్రాణాలనే కోల్పోతూనే ఉన్నారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఆర్‌ఎంపీలు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. మరోవైపు తక్కువ ఖర్చులో ఇంటికి సమీపంలో వైద్యసేవలు అందుతాయనే భావనతో ఏ వ్యాధికై నా ఆర్‌ఎంపీలనే సంప్రదిస్తుండటం చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం పరిపాటిగా మారిపోయింది.
ల్యాబ్‌లు, మెడికల్ షాపులు ఏర్పాటు చేసి..
నిబంధనల మేరకు ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స చేసేందుకే పరిమితం కావాలి. తమ సెంటర్‌లో ప్రథమ చికిత్స కేంద్రం అని బోర్డు మాత్రమే పెట్టుకోవాలి. కానీ చాలామంది ప్రవేటు ఆసుపత్రి తలపించేలా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో నాలుగైదు బెడ్స్ ఏర్పాటు చేసి, తామే డాక్టర్‌గా చలామణి అవుతూ రోగులకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. గ్రామాల్లో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఎక్కువగా ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా భావించిన వీరు పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు పెయిన్ కిల్లర్స్, యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వీటి వల్ల ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా రావడం, బీపీ పెరగడం, తగ్గడం, తల తిరగడం, వాంతులు, ఒంటి నొప్పుల వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ టైంలో సరైన ట్రీట్మెంట్ అందక ప్రాణాలే గాలిలో కలిసిపోతున్నాయి. మరికొందరు ఎలాంటి అర్హతలు లేకున్నా ల్యాబ్‌లు ఏర్పాటు చేసి అన్ని రకాల టెస్ట్లు, మెడికల్ షాపులు పెట్టి మందులు అమ్ముతూ తమ జేబులు నింపుకుంటున్నారు. కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా ఎంపీటీ కిట్లు వాడుతూ అబార్షన్లు సైతం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎంపీలపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదైనట్లు మెడికల్ కౌన్సిల్ చెబుతున్నా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఆర్‌ఎంపీ కేంద్రంపై కేసు నమోదైతే పేరును మార్చి మళ్లీ మరో పేరుతో కేంద్రాన్ని ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు. వారి పరిధిని దాటి వైద్యం అందించడంతో పాటు శస్త్రచికిత్సలు సైతం చేసేస్తున్నారు.
జరిగిన ఘటనలు మచ్చుకు కొన్ని ఇలా..
పట్టించుకోని వైద్యాధికారులు
ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నగరి నియోజకవర్గం విజయపురం మండలంలో సుమారు 15కి పైగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఉన్నాయి. ఒక పన్నూరు సబ్ స్టేషన్‌లోనే 7కు పైగా ఆర్‌ఎంపీ క్లినిక్‌లు ఉండగా అందులో ఓ ఆర్‌ఎంపీ క్లినిక్ 24 గంటలు జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడ బెడ్ ఏర్పాటు చేసి సైలెన్లు పెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పక్కనే మెడికల్ షాపు ఉంది. రెండు దశాబ్దాలుగా వైద్యం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.