
వారందరూ చీడ పురుగులే?
● కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదు ● మండిపడ్డ జీడీనెల్లూరు ఎమ్మెల్యే థామస్
సాక్షి టాస్క్‌ఫోర్సు: తన పీఏ చంద్రశేఖర్‌పై కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన వారందరూ చీడపురుగులేనని జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లుగా టీడీపీ గెలవని నియోజకవర్గంలో తాను గెలిచానని చెప్పారు. కొంతమంది పార్టిలో చీడపురుగులుగా చేరి తనపైన, తన పీఏపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ‘నా చేయి ఎక్కడ తాకినా బంగారమే.. నాకు కోట్ల రూపాయల సంపాదన ఉంది.. ఈ కొద్ది కాలంలో నా లెటర్ ప్యాడ్లు కూడా కొన్ని కనిపించ లేదు. ఫొటో షాప్‌లో కొందరు కలర్ జిరాక్స్ చెసి వాడుకున్నట్లు సమాచారం ఉంది. వాటన్నిటినీ కట్టడి చేస్తున్నా. ఈ క్రమంలో కొందరు పార్టీ పేరు చెప్పుకుని నా వెనుక చీడపురుగుల్లా చేరి పార్టీకి, నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి పక్కన పెటినందుకే ఇలా ఫిర్యాదు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. తన పీఏ ఎలాంటి తప్పులు చేయలేదన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తే ఇప్పుడు తన వద్ద పనిచేయకూడదా..? అని ప్రశ్నించారు.