
కేక్ కట్ చేస్తే తప్పేంటి?
టీడీపీ అల్లరిమూకలు దాడులు చేయడం తగదు
● వారికి అండగా పోలీసులు నిలవడమేంటి? ● గర్భిణిని కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయడం కనిపించలేదా? ● స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దాడులు ● ధ్వజమెత్తిన విజయానందరెడ్డి ● బాధితులకు ఆర్థిక సాయం
చిత్తూరు కార్పొరేషన్: అభిమానంతో తన పుట్టినరోజు నాడు అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేస్తే తప్పేమిటని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గురువారం గంగనపల్లె, గంగకాలనీల్లో తన బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడి చేయడం బాధాకరమన్నారు. గంగకాలనీకి చెందిన అరుణ్, రాజేష్ కేక్‌కట్ చేస్తే అది గిట్టని టీడీపీ డివిజన్ ఇన్‌చార్జ్ పచ్చయప్ప అల్లరిమూకలను రెచ్చగొట్టారని తెలిపారు. టీడీపీ నాయకులకు అండగా పోలీసు వ్యవస్థ ఉందని ఆరోపించారు. టు టౌన్ సీఐ నెట్టి కంఠయ్య సహకారంతో గుండాలు ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేసి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. సీఐ ప్రరవర్తన మార్చుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కో–ఆప్షన్ సభ్యుడు ఆను నివాసం వద్ద పదుల సంఖ్యలో అల్లరిమూకలు చేరుకుని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారన్నారు. అద్దాలు పగులగొట్టారని తెలిపారు. అలాగే గంగకాలనీలో 9వ తరగతి చదువుతున్న అరుణ్ సోదరి స్వాతిని జుట్టుపట్టుకుని కొట్టారని, గర్భవతి అయిన రాజేష్ భార్య గోమతిని కొట్టారని తెలిపారు. ఆమె స్ఫృహ కోల్పోవడంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు. రాజేష్ తల్లి రాజేశ్వరి టీడీపీ కార్యకర్తల కాళ్లు పట్టుకొని బతిమాలాడినా జాలిచూపకుండా దౌర్జన్యం చేశారన్నారు. ఈ విధ్వంసానికి కారణం చిత్తూరు ఎమ్మెల్యే అని విమర్శించారు. ఆయన అనుచరుడి ఆదేశాల మేరకు పోలీసుల సహకారంతో గొడవ చేశారన్నారు. పథకం ప్రకారం విద్యుత్ సరఫరా ఆపివేయించి దాడులు చేశారని తెలిపారు.
మీరు సంబరాలు చేసుకోలేదా?
టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకల పేరిట సంబరాలు చేసుకోలేదా..? అని డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ప్రశ్నించారు. గంగకాలనీలో అలజడి సృష్టించారన్నారు. పార్టీ, విజయానందరెడ్డి పై అభిమానంతో కేక్‌కట్ చేస్తే టీడీపీ నాయకులకు వచ్చిన సమస్య ఏమిటని ప్రశ్నించారు.
బాధితులకు సాయం
బాధితుల నివాసాలకు విజయానందరెడ్డి వెళ్లి పరామర్శించారు. ఘటనలో ధ్వంసమైన వస్తువులను చూసి వారితో మాట్లాడారు. ఒకొక్కరికీ రూ.50 వేలు చొప్పున మొత్తం లక్ష సాయం చేశారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, చుడా మాజీ చైఛైర్మన్ పురుషోత్తంరెడ్డి, గుడిపాల మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నాయకులు శివారెడ్డి, హరిషారెడ్డి, మురళీరెడ్డి, మధురెడ్డి, రాజేష్‌రెడ్డి, చామంతి, జగ్గా, అప్పొజీ, శేఖర్ పాల్గొన్నారు.

కేక్ కట్ చేస్తే తప్పేంటి?

కేక్ కట్ చేస్తే తప్పేంటి?