
పకడ్బందీగా ఆధార్ నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఆధార్ నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికీ ఆధార్ కార్డు తప్పనిసరన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానంగా ఉంటుందని వెల్లడించారు. ఇందులో ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కుప్పం, నగరి నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించాలని సూచించారు. విద్య, వైద్య, ఐసీడీఎస్, గ్రామ, వార్డు సచివాలయ అధికారులు సమన్వయంతో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రస్థాయిలో 58 శాతం
ఆధార్ నమోదుకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా 58 శాతం పూర్తి చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ నెలాఖరుకు ఆధార్ నమోదు 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలోనే జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 226 ఆధార్ కేంద్రాలున్నట్లు తెలిపారు. అందులో 117 గ్రామ, వార్డు సచివాలయాలు, 7 ఈ–సేవా కేంద్రాలు, 9 పోస్టాఫీసులు, 9 బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీసులు, 14 బ్యాంక్‌లు, 34 వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయల ద్వారా ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్ ప్రక్రియ చేపడుతున్నుట్లు వివరించారు. జిల్లాలో 0–5 ఏళ్ల పిల్లల జనాభా దాదాపు 1,53,047 ఉండగా, ఈ ఏడాది జూన్ 5 వ తేదీ నాటికి 88,179 మందికి ఆధార్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడల్, డీఆర్‌ఓ మోహన్‌కుమార్, డీఎల్‌డీఓ రవికుమార్, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఈఓ వరలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సుధారాణి పాల్గొన్నారు.