
రోజువారీగా టోకెన్లు పంపిణీ
పూతలపట్టు (యాదమరి): రైతులకు రోజువారీగా టోకెన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో రెండు రోజుల పర్యటన పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆయన ఆదివారం పూతలపట్టు మండలం గల్లా ఫుడ్స్ పరిశ్రమను సందర్శించారు. అక్కడ తయారవుతున్న పల్ప్ ఉత్పత్తులను పరిశీలించారు. మ్యాంగో పల్ప్, మ్యాంగో జ్యూస్ పైన ప్రస్తుతం ఉన్న 12% జీఎస్టీని ఐదు శాతానికి తగ్గిస్తామన్నారు. దీనివల్ల వినియోగం పెరిగి డిమాండ్ పెరుగుతుందని పరిశ్రమ యజమానులకు తెలిపారు. అనంతరం అన్‌లోడింగ్ కోసం ట్రాక్టర్లతో వేచి ఉన్న రైతులతో సంభాషించారు. జిల్లా నలుమూలల నుంచి మండలంలోని మ్యాంగో ఫ్యాక్టరీలకు వస్తున్న మామిడి రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఏ రోజుకారోజు టోకెన్లను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు.