మంత్రివర్యా.. | - | Sakshi
Sakshi News home page

మంత్రివర్యా..

Jun 16 2025 5:41 AM | Updated on Jun 16 2025 5:41 AM

మంత్ర

మంత్రివర్యా..

కాణిపాకం : కూటమి ప్రభుత్వం మామిడి రైతుల కొంప ముంచుతోంది. మద్దతు ధర పేరుతో రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ర్యాంపుల్లో రూ.4కే పాట పాడుతోంది. ఫ్యాక్టరీలు రూ.5, 6కే ఫిక్స్‌ అయ్యాయి. మద్దతు ధరను ఫ్యాక్టరీలు మడతబెట్టాయి. రూ.8కే కొనలేమంటున్నాయి. తమిళనాడు కాయలకు గేట్లు తీస్తున్నాయి. తమిళనాడు కాయలు టన్నుల టన్నులుగా తరలి వచ్చేస్తున్నాయి. దీని దెబ్బకు చిత్తూరు కాయలను ఫ్యాక్టరీ నిర్వాహకులు చెత్తలో తీసి పారేస్తున్నారు. ఇది ఇలా ఉంటే... మద్దతు ధరపై మండి పడుతున్నారు. అధికారులు రైతుల కంటికి కనిపించకుండా దాగుడు మూతలాడుతున్నారు.

చెక్‌పోస్టులు ఉత్తిమాటేనా..

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉత్పత్తి అయినా మామిడి కాయలు యథేచ్ఛగా జిల్లాకు వచ్చేస్తున్నాయి. జిల్లాలో పండిన కాయలకు మాత్రం ఒక్క టోకెన్‌కు ఒక్క ట్రాక్టర్‌ మాత్రమే అనుమతిస్తున్నాయి. అయినా ఫ్యాక్టరీల వద్ద పడిగావులు కాస్తున్నారు. కాయలు ఫ్యాక్టరీలో అన్‌లోడింగ్‌ కాగా వాహనాలు ఫ్యాక్టరీల ఎదుట క్యూ కడుతున్నాయి. బండి ఫ్యాక్టరీల వద్దకు తీసుకెళితే రెండు రోజుల పాటు అక్కడే కునుకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాక్టర్లల్లోనే కాయలు ఆవిరవుతున్నాయి. ఫ్యాక్టరీలు కక్ష పూరితంగా కాయలను అన్‌లోడింగ్‌ చేయించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తమిళనాడు నుంచి వచ్చే వాహనాలకు టోకెన్లు లేకపోగా నేరుగా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి అన్‌ లోడింగ్‌ చేసి వెళ్లిపోతున్నాయి. అది కూడా లారీల్లో తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. దీంతో జిల్లాలోని మామిడి రైతులు మండిపడుతున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సరిహద్దులో చెక్‌పోస్టులు పెట్టి జిల్లా రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇస్తే..పట్టింపు ఏదని మామిడి రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు.

కనిపించని అధికారులు

మామిడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లా అధికారులు ఫ్యాక్టరీల వద్ద వివిధ శాఖల సిబ్బందికి డ్యూటీలు వేశారు. అయితే వారి ఆ చూకీ అంతు చిక్కడం లేదు. ఫ్యాక్టరీల వద్ద వస్తున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. దరిదాపులో కనిపించకుండా పోతున్నారు. రైతుల దగ్గర నుంచి ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్‌ తీసుకోవడానికి ఫ్యాక్టరీ సెక్యూరిటీలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. చాలా వరకు ఫ్యాక్టరీల వద్ద శాఖ సిబ్బంది కనిపించడం లేదని, తమ అవస్థలను పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య వివాదం

మామిడి పంట అమ్మకాలు..కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తుతోంది. చిత్తూరులో మామిడి కొనుగోలుపై ఆంక్షలు ఏమిటని మండిపడింది. ఏకంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు పంపింది. ఇదీ రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం నంగలిలోని మామిడి రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. చిత్తూరులో కాయలు అమ్మడానికి ఆంక్షలు పెట్టారని అక్కడి రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. చిత్తూరు జిల్లా నుంచి కర్టాటక రాష్ట్రానికి వచ్చే ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ఈ వివాదం..ఇప్పుడు తారస్థాయికి చేరింది.

ఫ్యాక్టరీ వద్ద క్యూకట్టిన ట్రాక్టర్లు, లారీలు

తోతాపురి రూ.8కి కొనాలని మంత్రి ఆదేశం

క్షేత్రస్థాయిలో అమలు కాని ఆదేశాలు

ర్యాంపుల్లో కిలో రూ. 4... ఫ్యాక్టరీలో రూ.5, రూ.6

రూ.8కి కొనుగోలు చేయలేమంటున్న ఫ్యాక్టరీలు

ప్రభుత్వ మద్దతు ధరపై రైతుల మండిపాటు

పట్టించుకోని ఉన్నతాధికారులు

జిల్లా మామిడి సాగు వివరాలు

జిల్లాలో మామిడి సాగు విస్తీర్ణం 56 వేల హెక్టార్లు

టేబుల్‌రకం సాగు విస్తీర్ణం 16,105 హెక్టార్లు

తోతాపురి రకం సాగు విస్తీర్ణం 39,895 హెక్టార్లు

పళ్లగుజ్జు పరిశ్రమల సంఖ్య 47

ర్యాంపుల్లో తోతాపురి కేజీ ధర రూ.4

ఫ్యాక్టరీల్లో కిలో ధర రూ. 5 నుంచి రూ.6 వరకు

‘‘జిల్లాలోని కొన్ని మ్యాంగో ఫ్యాక్టరీలను తిరిగాను. ఫ్యాక్టరీ నిర్వాహకులతో మాట్లాడాను. ఈ రోజు తోతాపురి ధర కిలో రూ.7 అన్నారు. దానికి నేను ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచే రూ.8కి కొనుగోలు చేయాలని చెప్పాను. ఆ ఒక్క ఫ్యాక్టరీయే కాదు.... జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలు ప్రభుత్వం ప్రకటించిన రూ. 8కే కొంటారు. చివరి వరకూ ఇదే రేటు ఉంటుంది. ఎక్కడ కానీ రూ.5,రూ.6 రూ.7 అనే మాటే ఉండదు. దీనికి ప్రభుత్వం ప్రోత్సాహ నిధిగా కిలో రూ.4 ఇస్తుంది. రైతులు తొందర పడొద్దు. స్వేచ్ఛగా కాయలు అమ్మండి. సరిహద్దులో చెక్‌పోస్టులు పెట్టి..జిల్లా రైతులకు న్యాయం చేస్తాం. మామిడికి మద్దతు ధర ఇప్పించే బాధ్యత మాది.’’ ఇలా చిత్తూరు పర్యటనకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఇవీ.

రెండు రోజులుగా పడిగాపులు

శనివారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలకు కాయలు తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చింది ట్రాక్టర్లలోనే. ఇక్కడకు లారీల్లో తమిళనాడు కాయలు ఫుల్‌గా వస్తున్నాయి. ఏం చేయాలి. సిఫార్సులుంటే అన్‌లోడింగ్‌ ఉంటే ముందు పంపిస్తున్నారు. అన్‌లోడింగ్‌ కాక రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాం.

– మదన్‌ మోహన్‌నాయుడు,

చిత్తూరు మండలం

అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం

వారం రోజులుగా కాయలు అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నాం. టోకెన్లు అందడం లేదు. క్యూలో నిలబడే లోపే టోకెన్లు అమ్ముడుబోతున్నాయి. తమిళనాడు కాయలన్నీ వచ్చి దూకేస్తున్నాయి. మా కాయలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. అక్కడ రూ. 4, రూ.5కే కొనుగోలు చేసి.. జిల్లా రైతులను చిన్న చూపు చూస్తే ఎలా. కాయలు అమ్ముకోవడానికి మాకు అవకాశం కల్పించండి.

– జయచంద్రారెడ్డి, చిత్తూరు మండలం

ఆ రేటుకు కొనలేం

కూటమి ప్రభుత్వం 10 రోజుల కిందట మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించింది. తోతాపురి కిలో రూ.8కే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని ప్రకటించింది. అయితే మద్దతు ధరను ఫ్యాక్టరీలు మడతబెడుతున్నాయి. రూ. 8కి కొనలేమని తేల్చి చెబుతున్నాయి. మంత్రి చెబితే...తమ చేతుల్లో డబ్బులు లేవని చేతులెత్తేస్తున్నాయి. శనివారం చిత్తూరు సభలో తోతాపురిని అన్ని ఫ్యాక్టరీలు రూ. 8కే కొంటాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ సాక్షిగా వెల్లడించారు. అయితే ఆదివారం చూస్తే మామిడి వ్యాపారం ఇందుకు భిన్నంగా ఉంది. ర్యాంపులో కిలో రూ.4, ఫ్యాక్టరీలు కిలో రూ.5, రూ.6 కొనసాగిస్తున్నాయి. మంత్రి చెప్పినా కిలో రూ.8 రేటు ఎక్కడా అమలు కావడం లేదు.

మంత్రివర్యా..1
1/4

మంత్రివర్యా..

మంత్రివర్యా..2
2/4

మంత్రివర్యా..

మంత్రివర్యా..3
3/4

మంత్రివర్యా..

మంత్రివర్యా..4
4/4

మంత్రివర్యా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement