
సాక్షి, చిత్తూరు/చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే గురువారం జిల్లాలో నామినేషన్‌ల పర్వం మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని చిత్తూరు పార్లమెంట్ స్థానం, జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రిటర్నింగ్ అధికారులు ఆయా ఆర్‌ఓ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించారు.
తొలిరోజు 15 నామినేషన్‌లు దాఖలు....
జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్‌ల పర్వం సాగింది. తొలిరోజు 15 నామినేషన్‌లు దాఖలయ్యాయి. చిత్తూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థి దగ్గుముళ్ల ప్రసాదరావు కలెక్టరేట్‌లో ఆర్‌ఓ షణ్మోహన్‌కు ఒక సెట్ నామినేషన్ అందించారు. పుంగనూరు నియోజకవర్గంలో చల్లా రామచంద్రారెడ్డి (టీడీపీ), చల్లా పూజారెడ్డి (టీడీపీ), జి.మురళిమోహన్ (కాంగ్రెస్), కందడి షేక్ అన్వర్ భాషా (సోషియల్ డెమోక్రటిక్ పార్టీ), నగరిలో జి.భానుప్రకాష్ (టీడీపీ), గంగాధరనెల్లూరు లో ఉసురుపతి పద్మనాభం (ఇండిపెండెంట్), రత్నవేల్ గాంధీ (టీడీపీ), చిత్తూరు అసెంబ్లీకి ఎంసీ విజయానందరెడ్డి (వైఎస్సార్‌సీపీ–3 సెట్లు), జీసీ జగన్‌మోహన్ (టీడీపీ–2 సెట్లు), పలమనేరులో ఎన్.వెంకటేగౌడ (వైఎస్సార్‌సీపీ), పావని (వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి) నామినేషన్ వేశారు. కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
చిత్తూరులో..
విజయానందరెడ్డి నామినేషన్ వేసేందుకు నగరంలోని గంగినేని చెరువు నుంచి విజయా డెయిరీ వరకు ర్యాలీగా వచ్చారు. పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డితో కలిసి విజయానందరెడ్డి జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు.
జన ప్రవాహమే..!
నామినేషన్ ఘట్టానికి జనప్రవాహంలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి తెలిపారు. ఎండను సైతం లెక్కచేయకుండా ర్యాలీలో పాల్గొన్నారని ఆనందం వ్యక్తం చేశారు. అభిమానం చూపిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. ఎంపీ రెడ్డెప్ప మాట్లాడుతూ పేదలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో మేలు చేశారన్నారు. మరోసారి ఆయనను సీఎంగా చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందని స్పష్టం చేశారు. కుప్పంలో సైతం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వెల్లడించారు.


నామినేషన్ సమర్పిస్తున్న చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి
