ప్రైవేటు బాట
సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ప్రైవేట్ నిర్వాహకుల ఇష్టారాజ్యం డ్రైవింగ్ లైసెన్సు జారీని త్వరలో అప్పగించే అవకాశం వెలవెలబోతున్న ఆర్టీఏ కార్యాలయాలు
రవాణా సేవలు..
డబ్బుల వసూలు..?
రవాణాశాఖ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరమవుతున్నాయి. ఎల్‌ఎల్‌ఆర్ మినహా మిగిలిన సేవలు అప్పన్నంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లాయి. మిగిలిన అరకొర సేవలు కూడా ప్రైవేటుకు కట్టబెట్టేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతా ప్రైవేట్ పరం కావడంతో ఒకప్పుడు వాహనదారులతో కళకళలాడిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి.
పరివాహన్‌పై అవగాహన ఏదీ?
జిల్లాలో వాహనాల వివరాలు..
ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ ను బట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతోంది. జిల్లా మొత్తానికి చిత్తూరు నగర సమీపంలోని బంగారుపాళ్యం వద్ద ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది.దీంతో వారు అనేక వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ఒకప్పుడు రవాణాశాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ పనులపై వచ్చేవారితో కార్యాలయం రద్దీగా ఉండేది. క్రమేణ సేవలన్నీ ఆన్‌లైన్‌తో పాటు ప్రైవేటు పరం చేయడంతో రద్దీ తగ్గిపోయింది. సేవలన్నీ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించడంతో రవాణశాఖ నిర్వీర్యం అయిపోతోంది.
అప్పుడు.. ఇప్పుడు ఎలా ఉందంటే..
గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో కొనుగోలుదారులు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు.
స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వ హించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు.
డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ, దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనా అధికారి స్థాయిలో మాన్యువల్‌గా చేసి జారీ చేసే వారు. ఈ సేవలను ఆన్‌లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు.
వాహనాల్లో సామర్థ్యానికి మించి సరుకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్ పోస్టులు ఎత్తివేశారు.
రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ కారణంగా ఆ శాఖపై ఆసక్తి సన్నగిల్లుతోంది.
ప్రైవేటు బాట


