మాజీ మేయర్ హత్య కేసులో నేడు తీర్పు
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో శుక్రవారం చిత్తూరు కోర్టు తీర్పు వెలువరించనుంది. 2015 నవంబర్ 17న చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న అనురాధను తుపాకీతో కాల్చి చంపగా, ఆమె భర్త కటారి మోహన్‌ను కార్పొరేషన్ కార్యాలయంలోనే కత్తులతో వేటాడి నరికి చంపేశారు. టీడీపీ హయాంలో, ఆ పార్టీ నగర ప్రథమ పౌరురాలిని ప్రభుత్వ కార్యాలయంలోనే హత్య చేయడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో కటారి మోహన్ మేనల్లుడు చంద్రశేఖర్ (చింటూ)తో సహా 23 మందిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టుకు నేరాభియోగ పత్రం అందచేశారు. కేసులో ఒకరిని న్యాయస్థానం డిశ్చార్జ్ చేయగా, మరో నిందితుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక చింటూతో సహా 21 మంది నిందితులుగా ఉన్నారు. దీనిపై దాదాపు ఏడాదిన్నర కాలంగా సుదీర్ఘ విచారణ జరిపిన చిత్తూరులోని మహిళలపై జరిగే నేరాల విచారణ ప్రత్యేక న్యాయస్థానం తీర్పును ఈనెల 24వ తేదీ వెలువరించనున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం ఇవ్వనున్న తీర్పుపై కటారి దంపతుల కుటుంబం, చింటూ వర్గం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తీర్పు నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. అలాగే చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, కటారి కుటుంబ నివాసాల వద్ద పోలీసుల భద్రతను కూడా ఏర్పాటు చేశామన్నారు. పోలీసు 30 యాక్ట్ అమల్లో ఉంది. విజయోత్సవ ర్యాలీ, ఊరేగింపులు కూడా నిషేధమని డీఎస్పీ తెలిపారు. గురువారం సాయంత్రం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, ఏఆర్ డీఎస్పీ మహబూబ్ బాష, వన్‌టౌన్ సీఐ మహేశ్వర తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.


