పచ్చనేతల రేషన్‌ దందా | - | Sakshi
Sakshi News home page

పచ్చనేతల రేషన్‌ దందా

Oct 24 2025 7:48 AM | Updated on Oct 24 2025 7:48 AM

పచ్చనేతల రేషన్‌ దందా

పచ్చనేతల రేషన్‌ దందా

రూ. 8 లక్షలు విలువ గల 31.4 టన్నుల రేషన్‌ పట్టివేత ఏడు వాహనాలు స్వాధీనం నిందితులను పట్టుకోలేదంటున్న పోలీసులు ఆగని అక్రమ రవాణా బియ్యం వెనుక దొంగలు పట్టుబడేనా?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : రేషన్‌ మాఫియా చేస్తున్న కూటమి నేతలు తరచూ పట్టుబడుతూనే ఉన్నారు. లక్షల విలువైన రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో బుధవారం అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువగల 31.4 టన్నుల రేషన్‌ బియ్యం, ఏడు వాహనాలను డీఎస్పీ మహమ్మద్‌ సయ్యద్‌ అజీజ్‌ నేతృత్వంలో పోలీసులు పట్టుకున్నారు.

నాలుగు నెలల కిందట..

ఈ ఏడాది జూన్‌ 30న ఇదే ప్రాంతంలో సుమారు 6 లక్షలు విలువ గల 13 టన్నుల బియ్యం పట్టుకున్నారు. ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రదారి అయిన టీడీపీ నేత అమృతరాజ్‌ నాడార్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌తో పాటు వై.ధనుష్‌, డి.బోస్‌, ఎన్‌.రోహిత్‌, వి.దినేష్‌, గజేంద్రన్‌, రాజేష్‌ అలియాస్‌ రాజు అనేవారిని అరెస్టు చేశారు.

అక్రమార్కులపై ప్రత్యేక నిఘా

బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సీఐ విక్రమ్‌ వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మున్సిపల్‌ పరిధి కీళపట్టు వద్ద తిరుత్తణి బైపాస్‌ రోడ్డును ఆనుకొని మూతబడి ఉన్న జోర్‌ ఎంజాయ్‌ హోటల్‌లో రేషన్‌ బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కాగా సమాచారం అందింది. దీంతో డీఎస్పీ, సీఐ సిబ్బందిని వెంటబెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్‌ మేఘవర్ణం, వీఆర్వోతో పాటు సంబంధిత స్థలానికి చేరుకొని అక్కడ నిల్వ ఉంచిన బియ్యం, నాలుగు పెద్ద వాహనాలు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో బియ్యం నిల్వను కొలత వేయగా 31.4 టన్నులు ఉన్నట్లు తేలింది. ఈ రేషన్‌ బియ్యం ఎవరెవరు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు. అక్రమ రవాణాలో పాత్రదారులు ఎవరు అనే విషయాలు ప్రత్యేక దర్యాప్తు చేసి అందరిపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సీజ్‌ చేసిన బియ్యాన్ని మండల స్థాయి స్టాక్‌ పాయింట్‌ గోదాముకు సేఫ్‌ కస్టడీ నిమిత్తం తరలించారు.

జోర్‌ ఎంజాయ్‌ హోటల్‌ టీడీపీ నేతదే

అక్రమ బియ్యం నిల్వలు రెండుసార్లు పట్టుబడిన జోర్‌ ఎంజాయ్‌ హోటల్‌ టీడీపీ నేత అమృతరాజ్‌ నాడార్‌దే అని, ఆయన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్‌ అనుచరుడని నగరి పట్టణ ప్రజలు అందరికీ తెలిసిన విషయమే. అయినా పట్టుకున్న బియ్యం ఎవరిదో కనిపెట్టాలంటూ పోలీసులు తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

నిండ్ర మండలంలోనూ అదే తంతు

ఈ నెల 14వ తేదీన నిండ్ర మండలం, అత్తూరులోను నిల్వ ఉంచిన 34 బస్తాల రేషన్‌ బియ్యం పట్టుకున్నారు. ఆ కేసులోను పోలీసులు నిందితుల పేర్లు వెల్లడించకుండా నగరి పట్టణానికి చెందిన వ్యక్తి బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచుతున్నారని మాత్రమే పేర్కొన్నారు. కాని నిందితుల పేర్లు వెల్లడించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement