కేజీబీవీల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర కేజీబీవీ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో కేజీబీవీ ఎస్‌వోలతో సమావేశం నిర్వహించారు. పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో గత ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు. కేజీబీవీల్లో అమలు చేస్తున్న విజయపథం, విద్యాసక్తి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం గత విద్యాసంవత్సరం మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేసిన ఎస్‌వోను సత్కరించారు. సమావేశంలో జిల్లా సమగ్రశిక్షాశాఖ ఏపీసీ వెంకటరమణ, కేజీబీవీ పాఠశాలల జీసీడీవో ఇంద్రాణి, పలువురు ఎస్‌వోలు పాల్గొన్నారు.
పెద్ద శేష వాహన సేవ రేపు
తిరుమల: తిరుమలలో శనివారం నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుంచి 9 గంటలవరకు మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.


