‘కోడ్‌’ ఉల్లంఘనపై ఆరు కేసులు | Sakshi
Sakshi News home page

‘కోడ్‌’ ఉల్లంఘనపై ఆరు కేసులు

Published Sat, Apr 13 2024 12:35 AM

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు - Sakshi

చిత్తూరు అర్బన్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ) ఉల్లంఘించిన ఘటనపై ఇప్పటి వరకు జిల్లాలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఉల్లంఘనుల్లో టీడీపీ, బీజేపీ నాయకులే ఎక్కువగా ఉన్నారు. చౌడేపల్లెలో బీవైసీ పార్టీ నాయకుడు రామచంద్రా యాదవ్‌ ర్యాలీలో బాణసంచా పేల్చడం, చిత్తూరులోని ఎన్‌ఆర్‌ పేటలో టీడీపీ అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ నాయుడు ప్రచారంలో మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై రెండు కేసులు నమోదయ్యాయి. అలాగే రొంపిచెర్ల ప్రచారంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చల్లా బాబు నిబంధనలు అతిక్రమించడం, ఐరాలో రంజాన్‌ తోఫా పంపిణీ చేసిన టీడీపీ నేతలు సంచులకు పార్టీ చిహ్నాలు ముద్రించి ఇవ్వడంపై అధికారులు కేసులు నమోదు చేశారు. ఈక్రమంలోనే పలమనేరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటేగౌడ విద్యార్థులకు అందించిన పరీక్ష ప్యాడ్‌లకు పార్టీ రంగులు వేయడంపై సైతం కేసు నమోదైంది.

బోయకొండలో

రాహుకాల అభిషేకం

చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధలతో రాహుకాల అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువ జామునే ఆలయం శుద్ధి చేసి మామిడి, వేపాకు, పూలతోరణాలతో అలంకరించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాహుకాల సమయంలో నిర్వహించిన అభిషేకానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం సుమారు 2వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ సభ్యుడు రాజేష్‌ పాల్గొన్నారు.

హైరిస్క్‌ గర్భిణులకు

మెరుగైన వైద్యం

చిత్తూరు రూరల్‌: హైరిస్క్‌ గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవిరాజు ఆదేశించారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో వైద్య సిబ్బందితో మాతృమరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణులు ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. హైరిస్క్‌ కేసులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రసవానికి సకాలంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో వైద్యాధికారి జానకీరావ్‌ పాల్గొన్నారు.

ఘనంగా జాతీయ

సర్వే దినోత్సవం

చిత్తూరు కలెక్టరేట్‌ : కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం ఘనంగా జాతీయ సర్వే దినోత్సవం నిర్వహించారు. జేసీ శ్రీనివాసులు మాట్లాడుతూ సర్వే కోసం వచ్చే ప్రజలు న్యాయం జరిగి తిరిగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లేలా సర్వేయర్లు పనిచేయాలన్నారు. సర్వే వృత్తి చాలా గొప్పదని, ప్రభుత్వం వందేళ్ల తర్వాత భూ రీసర్వే చేపట్టిందని తెలిపారు. ఎంతో శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ సర్వేయర్లు కష్టపడ్డారని వెల్లడించారు. రికార్డులను ప్రక్షాళన చేసుకుంటే సర్వే పనుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో సర్వేయర్లు కీలకమన్నారు. రూట్‌ మ్యాపులు తయారు చేయడంతో పాటు ఆయా ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు సహకరించాలని సూచించారు. అనంతరం విధుల్లో, వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన వారికి సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషా పాల్గొన్నారు.

సర్వేయర్‌లకు సర్టిఫికేట్లు అందజేస్తున్న జేసీ శ్రీనివాసులు
1/2

సర్వేయర్‌లకు సర్టిఫికేట్లు అందజేస్తున్న జేసీ శ్రీనివాసులు

మాట్లాడుతున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవిరాజు
2/2

మాట్లాడుతున్న ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రవిరాజు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement