విధ్వంసం.. రక్తసిక్తం | - | Sakshi
Sakshi News home page

విధ్వంసం.. రక్తసిక్తం

Aug 5 2023 1:36 AM | Updated on Aug 5 2023 10:32 AM

- - Sakshi

టీడీపీ రౌడీలు విధ్వంసానికి తెగబడ్డారు. జబ్బలు చరుస్తూ.. ఈలలు వేస్తూ గూండాగిరిని ప్రదర్శించారు. మారణాయుధాలతో వీరంగం సృష్టించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం పేట్రేగిపోయారు. అడ్డూ అదుపూలేకుండా బరితెగించేశారు. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో రణరంగం సృష్టించారు.

అడ్డొచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణం కల్పించారు. అక్కడే ఉన్న పోలీసు వాహనాలకు నిప్పుపెట్టి, స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. వీరి అరాచకాలకు స్థానికులతోపాటు పోలీసులూ బెంబేలెత్తిపోయారు. మహిళలు తలుపులేసుకుని ఇంట్లోకి పరుగులు తీయగా.. దుకాణదారులు, ఇతర వర్తకులు షాపులు మూసేసి ఇళ్లకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇంతకీ ఎందుకు ఈ విధ్వంసం.. ఎవరిని ఏం చేయాలని..? మీరే చదవండి!

పుంగనూరు: ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం తలపెట్టిన రోడ్‌షో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎక్కడ చూసినా రివ్వున దూసుకొస్తున్న రాళ్లు.. చెలరేగుతున్న మంటలు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పుంగనూరులో యుద్ధవాతావరణం తలపించింది. టీడీపీ రౌడీమూకల దాడులతో గందరగోళం ఏర్పడింది.

ఉనికి కోసం రూటు మార్చి.. దూసుకొచ్చి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రోడ్‌షో పుంగనూరు బైపాస్‌ మీదుగా పలమనేరు వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన తన ఉనికి కోసం అడ్డదారులు తొక్కారు. టీడీపీ కార్యకర్తలు, రౌడీమూకలను వెంటబెట్టుకుని అనుమతి లేని మార్గంలో దూసుకొచ్చారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు పుంగనూరు పట్టణంలోనికి వెళితే శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని భావించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ అనుమతి మేరకు బైపాస్‌లో వెళ్లాలని సూచించారు. పోలీసుల మాటలను ఖాతరు చేయని తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా వారిపైకి తిరగబడ్డారు. రాళ్లు, మద్యం సీసాలు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఈ సంఘటతో పోలీసులు పరుగులు తీయాల్సి వచ్చింది. అనంతరం టీడీపీ రౌడీలు పోలీస్‌ వాహనాలకు నిప్పుపెట్టి తగులబెట్టారు.

ప్రాణభయంతో పరుగులు
టీడీపీ అల్లరిమూకల రాళ్లదాడిలో పోలీసులకు రక్తగాయాలయ్యాయి. మహిళా పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణభయంతో పలువురు పరుగులు తీయాల్సి వచ్చింది. భద్రతా చర్యల్లో పాల్గొన్న 50 మంది పోలీసులు గాయపడ్డారు. ఐదుగురు సీఐలు, మరో ఐదుగురు ఎస్‌ఐలు, ఏఎస్పీ, డీఎస్పీతో పాటు సుమారు 35 మంది కానిస్టేబుళ్లకు రాళ్ల దెబ్బలు తగిలాయి.

భయం..భయం
పుంగనూరు ఆహ్లాదానికి.. ప్రశాంతతకు మారుపేరు. ఇక్కడి ప్రజలు మృధుస్వభావం గల సౌమ్యులు. ఇప్పటి వరకు ఎలాంటి గొడవలు లేవు. టీడీపీ అధినేత రాకతో ఇక్కడి వాతావరణం మారిపోయింది. టీడీపీ రౌడీమూకల దాడులతో స్థానికులు భయంతో వణికిపోవాల్సి వచ్చింది.

కేసులు నమోదు
విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బందిపై దాడిచేసి, వాహనాలను తగులబెట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు.

రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదు
రామకుప్పం: చంద్రబాబు రెచ్చగొట్టే ధోరణి మార్చుకోవాలని ఎమ్మెల్సీ భరత్‌ హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబు దురుద్దేశంతోనే టీడీపీ కార్యకర్తలను ఉసిగొల్పారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం తథ్యమన్నారు. నీచ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోలేకే కక్షపూరితంగా అల్లర్లకు పాల్పడుతున్నారని విమర్శించారు.

నేడు జిల్లా బంద్‌
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులపై జరిగిన దాడులకు నిరసనగా శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు భరత్‌ శుక్రవారం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రజలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు.

పరిశీలన..పరామర్శ 
ఈ సంఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం డీఐజీ రవిప్రకాష్ , ఎస్పీ రిషాంత్‌రెడ్డి పుంగనూరుకు చేరుకుని సంఘటనా స్థలాన్ని, తగులబడిన పోలీస్‌ వాహనాలను పరిశీలించారు. పరిస్థితులపై పోలీస్‌ అధికారులతో  సమీక్షించారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని పరామర్శించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వాహనాలు, ఆస్తుల వద్ద గస్తీ ఏర్పాటు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement