వేకువజామునే ఈమెయిల్స్‌.. ఎందుకంటే.. | Why Tech Giants Send Layoff Emails at 6 AM The Hidden Corporate Strategy | Sakshi
Sakshi News home page

వేకువజామునే ఈమెయిల్స్‌.. ఎందుకంటే..

Apr 4 2026 12:23 PM | Updated on Apr 4 2026 12:36 PM

Why Tech Giants Send Layoff Emails at 6 AM The Hidden Corporate Strategy

నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం అనేది ఏ సమయానికి ఊడుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా దిగ్గజ టెక్ కంపెనీలైన ఒరాకిల్, గూగుల్, మెటా వంటి సంస్థల్లో ఇటీవలి కాలంలో జరిగిన తొలగింపుల సరళిని గమనిస్తే ఒక విచిత్రమైన, ఆందోళనకరమైన డిజిటల్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఈమెయిల్స్‌ తెల్లవారుజామున 6 గంటలకే పంపిస్తున్నాయి. అందుకు కొన్ని కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఆఫీసు వేళలు ప్రారంభం కాకముందే, అంటే ఉద్యోగులు ఇంకా నిద్రలో నుంచి మంచం దిగకముందే లేదా అప్పుడప్పుడే నిద్రలేస్తున్న సమయంలో ఈ-మెయిల్స్ పంపడం వెనుక కంపెనీలకు ఒక బలమైన వ్యూహం ఉంది.

  • ఉదయాన్నే ఉద్యోగి ఇంకా ఆఫీసుకి రాకముందే సమాచారం ఇవ్వడం వల్ల ఆఫీసు ఫ్లోర్‌లో అకస్మాత్తుగా గందరగోళం తలెత్తకుండా నిరోధించవచ్చు.

  • వర్కింగ్‌డే మధ్యలో తొలగింపు ప్రస్తావనలు వస్తే స్లాక్ ఛానెళ్లు లేదా టీమ్ కాల్స్‌లో ఒకరికొకరు సందేశాలు పంపుకుంటూ తక్షణమే ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే పంపడం ద్వారా ఈ కమ్యూనికేషన్ చైన్‌ను కంపెనీలు కట్ చేస్తున్నాయి.

సాంకేతిక అనుసంధానం కట్‌

కంపెనీల్లో ఉద్యోగం తొలగించిన వారికి సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్, ఇంటర్నల్ టూల్స్, అధికారిక ఈమెయిల్ ఖాతాల నుంచి యాక్సెస్‌ను రద్దు చేసేందుకు యాజమాన్యాలకు ఉదయం వీలు దొరుకుతుంది. ఈమెయిల్ పంపిన నిమిషాల్లోనే ఆయా సిస్టమ్స్‌ను షట్-డౌన్ చేయడానికి కంపెనీలకు తెల్లవారుజాము సమయం ఒక ‘సేఫ్ విండో’లా పనిచేస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ స్టేట్‌మెంట్లను సిద్ధం చేయడం, మిగిలిన టీమ్ మెంబర్లకు గైడ్ లైన్స్ ఇవ్వడం వంటి పనులకు మేనేజ్‌మెంట్‌కు కొంత సమయం దొరుకుతుంది.

మాయమవుతున్న మానవీయ కోణం

కంపెనీల దృష్టిలో ఇది కేవలం రిస్క్ మేనేజ్‌మెంట్ మాత్రమే కావచ్చు. కానీ ఒక ఉద్యోగి కోణం నుంచి చూస్తే ఇది అత్యంత కఠినమైన చర్య. ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో ఎవరితోనూ మాట్లాడే అవకాశం లేనప్పుడు తన కెరీర్ ముగిసిందని తెలుసుకోవడం మానసికంగా కుంగదీస్తుంది. కొన్ని సంస్థల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రక్రియ సజావుగా సాగాలనే ఆరాటంలో కంపెనీలు మానవ సంబంధాలను మరుస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement