న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు.
భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది.
సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది.


