
30% వరకు పెరిగిన డేటా వాడకం
వొడాఫోన్ ఐడియా
సీటీవో జగ్బీర్ సింగ్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియా దేశీయంగా 5జీ సేవలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా దృష్టి పెడుతోంది. తమకు స్పెక్ట్రం ఉన్న 17 ప్రాధాన్య సర్కిల్స్‌పై ఫోకస్ చేస్తున్నామని, ఏపీ సర్కిల్‌కి సంబంధించి ఇప్పటికే విశాఖ, తిరుమలలో 5జీ సేవలను ప్రవేశపెట్టామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సీటీవో) జగ్బీర్ సింగ్ తెలిపారు. త్వరలోనే జాతీయ స్థాయిలో మరో నగరంలోనూ ప్రారంభిస్తున్నామని వివరించారు.
5జీ సర్వీసులను అందిస్తున్న ప్రాంతాల్లో తమ నెట్‌వర్క్‌కి సంబంధించి డేటా వినియోగం 25–30 శాతం వరకు పెరిగిందని ఆయన చెప్పారు. సగటున డేటా వినియోగం నెలకు 22–23 జీబీ నుంచి 26–27 జీబీకి పెరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 83 శాతం మందికి, ప్రాధాన్యతా సర్కిళ్లలో 88 శాతం మందికి తమ 4జీ సేవలు అందుబాటులో ఉంటున్నాయని సింగ్ చెప్పారు.
పుణెలోని సూపర్ నెట్‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఎన్‌వోసీ) సందర్శన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ ఏడాది జూన్ వరకు సుమారు 15 నెలల వ్యవధిలో 5జీ, 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకునేందుకు ప్రస్తుత సైట్లలో మరింత స్పెక్ట్రంను వినియోగంలోకి తేవడంతో పాటు కొత్తగా 1,000 సైట్లను సంస్థ ఏర్పాటు చేసింది. కార్యకలాపాల్లో కృత్రిమ మేథ (ఏఐ) ఆటోమేషన్‌ను వినియోగించుకోవడంపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు జగ్బీర్ సింగ్ తెలిపారు.
ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యోచన లేదు..
ఫిక్సిడ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) విభాగంలో పోటీపడే యోచనేదీ ప్రస్తుతానికి లేదని సింగ్ చెప్పారు. ఇప్పటికైతే తాము ప్రధానంగా మొబిలిటీ విభాగంపైనే దృష్టి పెడుతున్నామని వివరించారు. అటు, శాటిలైట్ కమ్యూనికేషన్స్ సర్వీసులు వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రావొచ్చని పేర్కొన్నారు.
ఈ సర్వీసులకు సంబంధించి ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో వొడాఫోన్ ఐడియా జట్టు కట్టింది. మరోవైపు, ఇప్పటికే యాంటీ–స్పామ్ మెసేజీ అలర్టులను అందుబాటులోకి తెచ్చామని, యాంటీ–స్పామ్ కాల్ అలర్టు సేవలను కూడా త్వరలో ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
పుణెలోని వొడాఫోన్ ఐడియా ఎస్‌ఎన్‌వోసీ 2012లో ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని మరో యూనిట్‌తో కలిసి ఇది దేశవ్యాప్తంగా కంపెనీ మొత్తం నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తుంది. 22 సర్కిళ్లలోని విస్తృతమైన నెట్‌వర్క్‌లో స్థూల స్థాయి నుంచి సూక్ష్మ స్థాయి దాకా సమస్యలను ఇరవై నాలుగ్గంటలూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిష్కరించేందుకు కృషి చేస్తుంటుంది. ప్రతి రోజు 85 లక్షల అలర్టులను ప్రాసెస్ చేస్తుంది. 5 లక్షల పైగా డివైజ్ హెల్త్ చెక్‌లను నిర్వహిస్తుంటుంది.