
దేశీయంగా ఈ ఆగస్టులో 3,21,840 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు వాహన తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. తగ్గిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీలు డీలర్లకు సరఫరాను సర్దుబాటు చేసినట్లు పేర్కొంది. 2024 ఇదే ఆగస్టులో అమ్ముడైన 3,52,921 వాహనాలతో పోలిస్తే ఈసారి 9% తగ్గాయి.
‘‘జీఎస్టీ రేట్ల సవరణ కారణంగా ధరలు తగ్గే వీలుందని అంచనా వేసిన కస్టమర్లు వాహన కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా చేసుకున్నారు. దీంతో ఆగస్టులో డిమాండ్ తగ్గింది. అందుకు తగ్గట్లు కంపెనీలు సైతం డీలర్లకు సరఫరా సర్దుబాటు చేశాయి.’’ అని సియామ్ ప్రకటనలో తెలిపింది.
👉అయితే ద్విచక్ర అమ్మకాల్లో 7% వృద్ది నమోదైంది. ఆగస్టులో మొత్తం 18,33,921 అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలు 17,11,662 యూనిట్లుగా ఉన్నాయి. మోటార్ సైకిళ్ల విక్రయాలు 10,60,866 నుంచి 11,06,638కు; స్కూటర్ల అమ్మకాలు 6,43,169 నుంచి 6,83,397కు పెరిగాయి. అయితే మోపెడ్లు మాత్రం 44,546 నుంచి 43,886కు పరిమితమయ్యాయి.
👉త్రి చక్ర వాహన విక్రయాలు రికార్డు స్థాయిలో 8% వృద్ధి నమోదైంది. ఆగస్టులో 69,962 నుంచి 75,759 యూనిట్లకు పెరిగాయి.
👉‘‘కేంద్రం జీఎస్‌టీ రేట్ల తగ్గింపు నిర్ణయంతో అందుబాటు ధరల వాహనాలు కస్టమర్లను ఆకర్షిస్తాయి. అలాగే పండుగ ఉత్సాహానికి మరింత ఉపకరిస్తుంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ తెలిపారు.