ఈ పద్దతులు పాటిస్తే ‘మ్యూచువల్‌’లో లాభాలు

UTI Fund Manager Ankit Agarwal Opinions On Stock Market Amid Covid Crisis - Sakshi

కంపెనీల ఆదాయాలతో మార్కెట్లకు దిశానిర్దేశం

ఆశావహంగా లేకపోతే ర్యాలీకి బ్రేక్‌ పడొచ్చు 

హెల్త్‌కేర్, కెమికల్స్‌ తదితర స్టాక్స్‌లో అవకాశాలు 

యూటీఐ ఫండ్‌ మేనేజర్‌ అంకిత్‌ అగర్వాల్‌   

కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో కూడా గరిష్ట స్థాయిల్లో తిరుగాడుతున్న మార్కెట్లకు .. ఇక కంపెనీల ఆదాయాలు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నారు యూటీఐ ఫండ్‌ మేనేజర్‌ (ఈక్విటీ) అంకిత్‌ అగర్వాల్‌. అయితే, దీర్ఘకాలిక లక్ష్యాలు గల ఇన్వెస్టర్లు .. మార్కెట్‌ ఒడిదుడుకులతో ఆందోళన చెందకుండా క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించాలవచ్చని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు.. 

కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి సమయంలో కూడా మార్కెట్లు గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయి. మార్కెట్లు ఇకపై ఎలా ఉండవచ్చు?
బహుశా కోవిడ్‌ ఫస్ట్‌ వేవ్, ఆ తర్వాత చోటుచేసుకున్న  V ఆకారపు రికవరీని బట్టి ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండవచ్చు. అంతర్జాతీయంగా కూడా మొదటి దశతో పోలిస్తే రెండో దశలో మార్కెట్లపై ప్రభావం మరీ ఎక్కువగా లేదు. స్వల్పకాలిక మార్కెట్‌ ధోరణుల గురించి చెప్పడం కష్టమే అయినప్పటికీ, మార్కెట్‌ పనితీరు అనేది కంపెనీల ఆదాయాల రికవరీని బట్టి ఉండవచ్చు. ఒకవేళ ఆదాయాలు నిరుత్సాహకరంగా ఉంటే.. ప్రస్తుత ర్యాలీ ఆగవచ్చు. అక్కణ్నుంచి ఆదాయాలు ఎప్పుడు రికవర్‌ అవుతాయన్న దానిపై తదుపరి దశ మార్కెట్ల పనితీరు ఆధారపడుతుంది. 

స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్‌ కంపెనీల పనితీరు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది?
గతేడాది మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల పనితీరు లార్జ్‌ క్యాప్స్‌ కన్నా మెరుగ్గా నమోదైంది. కొంత మేర వాటి మధ్య ఉన్న వ్యత్యాసం భర్తీ అయింది. గతంలోలాగానే ఇప్పటికీ మిడ్, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు.. లార్జ్‌ క్యాప్‌లను మించిన పనితీరు కనపర్చేందుకు ఇంకా అవకాశం ఉంది. తక్కువ వడ్డీ రేట్ల ఊతంతో మొత్తం ఎకానమీ కోలుకుంటే .. ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. ఇక యూటీఐ మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ విషయానికొస్తే.. కోవిడ్‌ బైటపడ్డాక మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులను ఇది సమర్ధంగా తట్టుకుని నిలబడగలిగింది. ఆ తర్వాత చూసిన ర్యాలీలోనూ చక్కగా పాల్గొనగలిగింది.  

ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించవచ్చు?
ఫోర్ట్‌ ఫోలియోలో స్వల్పకాలిక ఒడిదుడుకులనను ఎదుర్కొనాలంటే దాన్ని ఏమీ చేయకుండా ఉండటమే ఉత్తమమైన వ్యూహం. ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలపైనే దృష్టి పెట్టి, తమ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఆయా లక్ష్యాలను సాధించేందుకు క్రమశిక్షణతో కేటాయింపులు కొనసాగించాలి. మార్కెట్లో ఎప్పుడు, ఎంత ఇన్వెస్ట్‌ చేయొచ్చన్నది నిర్ణయించుకునేందుకు కావాలంటే వేల్యుయేషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, మార్కెట్లో తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. స్థూలంగా చెప్పాలంటే అసెట్‌ కేటాయింపుపైనే పూర్తిగా దృష్టి పెట్టి, దీర్ఘకాలిక పెట్టుబడుల దృక్పథంతో ముందుకు సాగడం ద్వారా ఒడిదుడుకులను అధిగమించవచ్చు. 

స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా పెట్టుబడులకు ఏయే రంగాల్లో అవకాశాలు ఉన్నాయి?
మా పోర్ట్‌ఫోలియోలో సింహభాగం (సుమారు 70 శాతం భాగం), దీర్ఘకాలంలో మంచి వృద్ధి కనపర్చగలిగే, చక్కని మేనేజ్‌మెంట్‌ కలిగిన కంపెనీలే ఉన్నాయి. ఇవి తమ తమ రంగాల్లో లీడర్లుగా ఉన్నాయి. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌పై ఇవి భారీ రాబడులు ఇచ్చేందుకు ఆస్కారముంది. హెల్త్‌కేర్, కెమికల్స్, ఏపీఐ, వినియోగదారుల విచక్షణపై కొనుగోళ్లు ఆధారపడి ఉండే రంగాలు, పారిశ్రామికోత్పత్తులు మొదలైన వాటికి సంబంధించిన విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉండవచ్చు. కాలానుగుణంగా టర్న్‌ ఎరౌండుకు అవకాశమున్న రంగాలనూ చూడవచ్చు.

ప్రస్తుత పరిస్థితుల కారణంగా మందగమనంలో ఉన్న రంగాలను ఎంచుకోవచ్చు. ట్రావెల్, లీజర్, ఆటోమొబైల్, వాణిజ్య వాహనాల సంస్థలు మొదలైన వాటిని పరిశీలించవచ్చు. ఇక మా విషయానికొస్తే.. దీర్ఘకాలిక దృష్టితో నిర్వహించే పోర్ట్‌ఫోలియో కాబట్టి తప్పనిసరైన పరిస్థితులు ఏర్పడితే తప్ప స్వల్పకాలిక పరిణామాల ఆధారంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులూ చేయము. ఇప్పుడిప్పుడే తెరపైకి వస్తున్న డిజిటైజేషన్, ఆర్థిక సేవలకు ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి ధోరణులు.. మహమ్మారిపరమైన కారణాల వల్ల మరింత వేగం పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా పర్యావరణ అనుకూల ఇంధనాలు, సరఫరా వ్యవస్థలపై దృష్టి పెడుతున్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మేము ప్రయత్నిస్తాం.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top