ఒక్క క్లిక్‌తో లక్షల కోట్ల చెల్లింపులు.. నమ్మశక్యం కాని అంకెలు.. తొలి స్థానంలో ఫోన్‌పే..

Travellers to India can now use UPI for retail payments: RBI - Sakshi

దూసుకెళ్తున్న యూపీఐ లావాదేవీలు

జనవరిలో రూ.12,98,726 కోట్లు

అగ్ర స్థానంలో నిలిచిన ఫోన్‌పే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్‌స్టాంట్‌ రియల్‌ టైమ్‌ చెల్లింపుల వ్యవస్థ అయిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.

యూపీఐ వ్యవస్థ దేశంలో 2016 ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చూస్తే 2023 జనవరిలో నమోదైన గణాంకాలే అత్యధికం. టెలికం కంపెనీల దూకుడుతో పల్లెలకూ ఇంటర్నెట్‌ చొచ్చుకుపోయింది. స్మార్ట్‌ఫోన్లు జీవితంలో భాగమయ్యాయి. బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం లేకుండా పేమెంట్‌ యాప్స్‌ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా క్షణాల్లో సులభంగా, సురక్షితంగా చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. ఈ అంశాలే ఇప్పుడు యూపీఐ వేగంగా విస్తరించడానికి కారణమయ్యాయి.  

నమ్మశక్యం కాని అంకెలు..
యూపీఐ లావాదేవీల విలువ తొలిసారిగా 2018 డిసెంబర్‌లో రూ.1 లక్ష కోట్ల మార్కును దాటింది. ఆ నెలలో 62 కోట్ల లావాదేవీలకుగాను రూ.1,02,595 కోట్ల విలువైన మొత్తం చేతులు మారింది. సరిగ్గా ఏడాదిలో లావాదేవీల విలువ  రెట్టింపు అయింది. 2022 మే నాటికి లావాదేవీలు ఏకంగా రూ.10 లక్షల కోట్లకు ఎగిశాయి. 2017 జనవరిలో రూ.1,000 కోట్ల మార్కును దాటి రూ.1,696 కోట్ల లావాదేవీలు జరిగాయి. లావాదేవీలు అదే ఏడాది డిసెంబర్‌లో రూ.13,174 కోట్లకు చేరాయి. సరిగ్గా ఏడాదిలో లక్ష కోట్ల స్థాయికి ఎగిశాయి. ఈ గణాంకాలను చూస్తుంటే యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ పట్ల  ప్రజల్లో ఉన్న ఆదరణ ఇట్టే అర్థం అవుతోంది. 2023 జనవరి నాటికి 385 బ్యాంకులు యూపీఐ వేదికగా ఉన్నాయి.  

తొలి స్థానంలో ఫోన్‌పే..
దేశంలో యూపీఐ చెల్లింపుల్లో తొలి స్థానంలో నిలిచిన ఫోన్‌పే 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్‌ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ యాప్‌ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్‌ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.17,088 కోట్లు, యస్‌ బ్యాంక్‌ రూ.12,116 కోట్లు, భీమ్‌ రూ.8,164 కోట్లు, అమెజాన్‌ పే రూ.5,797 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.3,324.8 కోట్లు, కొటక్‌ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2,222 కోట్లు, ఎస్‌బీఐ రూ.1,902 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ రూ.1,467 కోట్లు సాధించాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్,, ఎయిర్‌టెల్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, వాట్సాప్, మొబిక్విక్‌ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ రూ.707 కోట్ల లావాదేవీలు నమోదు చేయడం విశేషం.

చిన్న మొత్తాలే అధికం..
జనవరి గణాంకాల ప్రకారం మొత్తం 803 కోట్ల లావాదేవీల్లో కస్టమర్లు వర్తకులకు చెల్లించిన వాటా 54.88 శాతం కాగా వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీలు 45.12 శాతం ఉన్నాయి. కస్టమర్లు వర్తకులకు చెల్లించిన లావాదేవీల్లో రూ.500 లోపు విలువ కలిగినవి 83.36 శాతం కైవసం చేసుకున్నాయి. రూ.500–2,000 మధ్య 11.63 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 5.01 శాతం ఉన్నాయి. వ్యక్తుల నుంచి వ్యక్తులకు జరిగిన లావాదేవీల్లో రూ.500లోపు విలువ కలిగినవి 54.71 శాతం, రూ.500–2,000 మధ్య 22.11 శాతం, రూ.2 వేలకుపైగా చెల్లించినవి 23.18 శాతం ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top