ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్‌ | TCS is third most valued IT services brand globally | Sakshi
Sakshi News home page

ప్రపంచ విలువైన కంపెనీల్లో టీసీఎస్‌

Jan 28 2021 4:38 AM | Updated on Jan 28 2021 6:41 AM

TCS is third most valued IT services brand globally - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల్లో ఉన్న భారత దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు (టీసీఎస్‌) మరో గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్స్‌లో మూడవ స్థానం చేజిక్కించుకుంది. యాక్సెంచర్, ఐబీఎంలు తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయని బ్రాండ్‌ ఫైనాన్స్‌–2021 నివేదిక తెలిపింది. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా టాప్‌–10లో భారత్‌ నుంచి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, విప్రో చోటు దక్కించుకున్నాయి. టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ 2020తో పోలిస్తే 2021లో 1.4 బిలియన్‌ డాలర్లు ఎగసి 14.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. వృద్ధి పరంగా 25 ఐటీ కంపెనీల్లో ఇదే అత్యధికం. కస్టమర్లు తమపై ఉంచిన నమ్మకానికి ఇది నిదర్శనమని టీసీఎస్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ఆర్‌.రాజశ్రీ ఈ సందర్భంగా తెలిపారు.

మెరుగైన ప్రతిభ..
ఐటీ కంపెనీలన్నిటి మొత్తం బ్రాండ్‌ విలువ 3 శాతం తగ్గితే.. టీసీఎస్‌ సుమారు 11 శాతం వృద్ధి సాధించడం ఇక్కడ గమనార్హం. 2020 నాల్గవ త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా 6.8 బిలియన్‌ డాలర్ల డీల్స్‌ను చేజిక్కించుకోవడంతో బలమైన ఆదాయం నమోదు చేసింది. ఐటీ రంగంలో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ సైతం గరిష్ట స్థాయిని తాకింది. బ్రాండ్‌ విలువ పరంగా ప్రపంచంలో ఈ రంగంలో రెండవ స్థానానికి చేరువలో టీసీఎస్‌ ఉందని బ్రాండ్‌ ఫైనాన్స్‌ సీఈవో డేవిడ్‌ హైగ్‌ తెలిపారు. రికవరీ మొదలుకావడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఐటీ రంగంతోపాటు యూఎస్, యూరప్‌లో ఫైనాన్షియల్‌ సెక్టార్‌లో పెట్టుబడులు పెరగడం కారణంగా రాబోయే ఏడాదిలో మరింత మెరుగైన ప్రతిభ కనబరుస్తుందని నివేదిక వెల్లడించింది. సంస్థలో ప్రస్తుతం 4,69,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

తొలి స్థానంలో యాక్సెంచర్‌..
ప్రపంచంలో అత్యంత విలువైన, బలమైన ఐటీ సర్వీసెస్‌ బ్రాండ్‌గా యాక్సెంచర్‌ తన స్థానాన్ని కొనసాగిస్తోంది. ఈ సంస్థ బ్రాండ్‌ వాల్యూ 26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. రెండవ స్థానాన్ని పదిలపర్చుకున్న ఐబీఎం బ్రాండ్‌ విలువ 16.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇక కాగ్నిజెంట్‌ను దాటి నాల్గవ స్థానానికి ఇన్ఫోసిస్‌ ఎగబాకింది. ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ విలువ 19 శాతం అధికమై 8.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌–10 బ్రాండ్లలో స్థానం సంపాదించింది. మహమ్మారికి ముందే డేటా సెక్యూరిటీ, క్లౌడ్‌ సర్వీసెస్‌పై దృష్టిసారించాలన్న ప్రాముఖ్యతను గుర్తించింది. కన్సల్టింగ్, డేటా మేనేజ్‌మెంట్, క్లౌడ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో భారీ ప్రాజెక్టులను దక్కించుకోవడంతో ఇన్ఫోసిస్‌ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. కాగ్నిజెంట్‌ బ్రాండ్‌ విలువ 6 శాతం తగ్గి 8 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్‌–7, విప్రో–9, టెక్‌ మహీంద్రా–15వ స్థానానికి వచ్చి చేరాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement