
అరవైఏళ్లు, 80 ఏళ్లు దాటిన వారు.. ఇలా వయసు పైబడిన వారికి, అంటే సీనియర్ సిటిజన్లకు బేసిక్ లిమిట్ మారుతుంది. ఇదంతా పాత పద్ధతిలో. కొత్త పద్ధతిలో సీనియారిటీతో సంబంధం లేకుండా అందరికీ ఒకే బేసిక్ లిమిట్. ఈ బేసిక్ లిమిట్‌లు, శ్లాబులు, రేట్లూ మీకు తెలిసినవే. పెన్షన్‌ని ‘జీతాల’ పరిధిలో పరిగణిస్తారు. పెన్షన్ కూడా ట్యాక్సబుల్ ఆదాయమే. రూ.10,000 పన్ను భారం దాటిన వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు వ్యాపారం, వృత్తి మీద ఆదాయం లేకపోతే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సినవసరం లేదు.
ఆదాయపు పన్ను చట్ట ప్రకారం, జీతాన్ని ఎలా ట్యాక్సబుల్‌గా భావిస్తారో, అలాగే పెన్షన్లను కూడా భావిస్తారు. చాలా మంది పెన్షన్ మీద మినహాయింపు ఉందనుకుంటారు. కానీ, అది నిజం కాదు. పెన్షన్ ట్యాక్సబుల్ ఆదాయమే. బేసిక్ లిమిట్ లోపు ఉంటే తప్ప.. పన్ను భారం తప్పించుకోవడం ఉండదు. గవర్నమెంటులో రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ పెన్షన్ మినహాయింపు ఉంది. ముందుగా లెక్కలు కట్టి, ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా కమ్యుటెడ్ పెన్షన్ మార్చుకోవచ్చు. పరమ్‌వీర్ చక్ర, మహా వీర్ చక్ర, వీర్ చక్ర మొదలైన వాటికి సంబంధించిన పెన్షన్లకు మినహాయింపు ఉంది. విదేశాల్లో సెటిల్ అయిన పెన్షనర్లకు వచ్చే పెన్షన్లను మన దేశంలోని ఆదాయంగా పరిగణిస్తారు. పెన్షన్లలో ఎరియర్స్ అంటే .. బకాయిలు వస్తే, వాటిని పన్ను పరిధిలోకి చేర్చి 89(1) సెక్షన్ కింద రిలీఫ్ పొందవచ్చు. ఈ పెన్షన్‌లో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంది.
ఇక ఫ్యామిలీ పెన్షన్ విషయానికొద్దాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత, తన పెన్షన్‌ని కుటుంబంలోని వ్యక్తికి ఇవ్వొచ్చు. ఇలాంటి చెల్లింపులను ఫ్యామిలీ పెన్షన్ అంటారు. ఇక్కడ పెన్షన్ అని పేరుంది కానీ, ఇలాంటి పెన్షన్‌ను ‘జీతం’గా భావించరు. ఇతర ఆదాయంగా భావిస్తారు. టీడీఎస్ అంశాలు వర్తించవు. పాత పద్ధతి అయితే రూ.15,000 మినహాయింపు ఇస్తారు. కొత్త పద్ధతి అయితే, రూ.25,000 మినహాయింపు వస్తుంది. సైన్యంలోని ఫ్యామిలీ సభ్యులకు మినహాయింపు పూర్తిగా ఇస్తారు. ఈ విషయానికి సంబంధించి చాలా పరిస్థితులనే పొందుపర్చారు. కానీ విధి నిర్వహణలో ఉండగా, సైన్యంలో చనిపోతే వారి కుటుంబానికి వచ్చే పెన్షన్ మీద మినహాయింపు ఉంటుంది.
పెన్షన్, ప్యామిలీ పెన్షన్‌కి సంబంధించి ట్యాక్స్ ప్లానింగ్ విషయాలు..
పాత పద్ధతిలో వెళ్తే మంచిదా. కొత్త పద్ధతిలో వెళ్తే మంచిదా అనేది ఆలోచించుకోవాలి.
వైద్యానికి సంబంధించిన మినహాయింపులను గత వారం తెలుసుకున్నాం. ఇవి పాత పద్ధతిలో ఉంటాయి.
పెన్షనరీ బెనిఫిట్స్ భారీగా వస్తాయి. వాటిని సక్రమంగా, సరిగ్గా, సమగ్రంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయొచ్చు.
80సీ డిడక్షన్లు అనవసరం అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. వార్ధక్యంలో సేవింగ్ మీద పెద్ద మొత్తాల్ని ‘బ్లాక్’ చేసుకోవడం ఎందుకు. చేతిలో లేదా అందుబాటులో బ్యాంకు బ్యాలెన్సులు ఉంటే మంచిది. ఉదాహరణకు వైద్యంలాంటి ఏ అవసరానికైనా ఉపయోగపడుతుందనేది ఆలోచన.
సీనియర్ సిటిజన్లకు ఎన్నో స్కీములు ఉన్నాయి. సరైన నిర్ణయం తీసుకోండి. ఆకర్షణీయమైన ప్రైవేట్ వ్యక్తుల చేతిల మోసపోకండి.
అయితే, ఎన్నో మంచి ఇన్వెస్ట్‌మెంట్లు, స్కీములు ఉన్నాయి. కేవలం పాత పద్ధతిలోనే వాటిపై వడ్డీకి మినహాయింపులు ఉన్నాయి.
ఎన్నారై సిటిజన్లు 15హెచ్ ఇవ్వకూడదు. కానీ రెసిడెంట్లు ఇవ్వొచ్చు. బ్యాంకు ఫిక్సిడ్ డిపాజిట్ల మీద వడ్డీ రూ. లక్ష దాటితే, టీడీఎస్ వర్తిస్తుంది. ట్యాక్సబుల్ ఇన్‌కం లోపల ఆదాయం ఉంటే, 15హెచ్ ఇస్తే పన్ను రికవరీ చేయరు. బేసిక్ లిమిట్ దాటితే 15హెచ్ ఇవ్వకూడదు.
గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్ .. వీటన్నింటికీ పూర్తి మినహాయింపు ఉంది. కానీ, అవి ఇన్వెస్ట్ చేస్తే వచ్చే వడ్డీ/ఆదాయంపై మినహాయింపు కొత్త విధానంలో లేదు.
75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు పెన్షన్ ఉండి, ఒకే ఒక బ్యాంకు అకౌంటులో నుంచి వడ్డీ .. ఈ రెండింటి మీదా పన్ను రికవరీ అయితే, రిటర్ను వేయనక్కర్లేదు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పిల్లల చదువు కోసమా, స్వంత వైద్యానికా, ఇల్లు కొనుక్కోవడమా, బంగారం కొనడమా, షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడమా, పిల్లలకు బహుమతిగా ఇవ్వడమా.. ఇలా ఎన్నో ఆలోచనలు.
తన సొంత పెన్షన్, భార్య ఫ్యామిలీ పెన్షన్.. ఇలా రెండూ కలిపి తడిసి మోపెడై.. పన్ను భారం చెల్లించే పెన్షనర్లు ఇంకొందరు. ఆదాయం అధికంగా ఉంటే పన్ను చెల్లించడమే ట్యాక్స్ ప్లానింగ్.
