మూడోసారి చంద్రశేఖరన్‌కే ఓటు | Tata Trusts recommends third term for Chandrasekaran as Tata Sons Chairman | Sakshi
Sakshi News home page

మూడోసారి చంద్రశేఖరన్‌కే ఓటు

Oct 15 2025 12:12 AM | Updated on Oct 15 2025 12:12 AM

Tata Trusts recommends third term for Chandrasekaran as Tata Sons Chairman

టాటా ట్రస్ట్స్‌ సిఫారసు 

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ కంపెనీల ప్రమోటర్, ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా మూడోసారి ఎన్‌.చంద్రశేఖరన్‌ ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తాజాగా టాటా ట్రస్ట్స్‌ సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. టాటా సన్స్‌ ఈక్విటీ మూలధనంలో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్‌ బోర్డు నియామకాలు, పాలనా సంబంధ అంశాలలో రెండుగా చీలిపోయిన నేపథ్యంలో చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ దాతృత్వ ట్రస్ట్‌ల సమాహారమైన టాటా ట్రస్ట్స్‌ చంద్రశేఖరన్‌వైపు ఎప్పుడు మొగ్గు చూపిందీ వెల్లడికానప్పటికీ దీనిపై టాటా సన్స్‌ స్పందనను గమనించవలసి ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  

గత వారం సమావేశంలో 
టాటా ట్రస్ట్స్‌ గత వారం నిర్వహించిన బోర్డు సమావేశంలో సాధారణ అంశాలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. 180 బిలియన్‌ డాలర్ల విలువైన వ్యాపార సామ్రాజ్యం కలిగిన టాటా సన్స్‌ కార్యకలాపాలకు విఘాతం కలగకుండా చూసే ఉద్ధేశ్యంతో వివాదాస్పద అంశాల జోలికిపోలేదని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి మూడోసారి చైర్మన్‌గా చంద్రశేఖరన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు సిఫారసు చేసినట్లు వెల్లడించాయి. దీనిపై టాటా సన్స్‌ బోర్డు నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు పేర్కొన్నాయి.

అయితే 65 ఏళ్ల వయసు దాటనున్న చంద్రశేఖరన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పదవిని నిర్వహిస్తారా లేక టాటా గ్రూప్‌ నిబంధనల ప్రకారం నాన్‌ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు తీసుకుంటారా అనేది వేచిచూడవలసి ఉన్నట్లు ఆ వర్గాలు తెలియజేశాయి. 2022 ఫిబ్రవరిలో ఐదేళ్ల కాలానికి  చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను రెండోసారి టాటా సన్స్‌ ఎంపిక చేసుకుంది. దీంతో 2027 ఫిబ్రవరివరకూ ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు.

అయితే టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా కలిగిన షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబం ఈ అంశంపై ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం! 2016 అక్టోబర్‌లో టాటా సన్స్‌లో చేరిన చంద్రశేఖరన్‌ 2017 జనవరిలో చైర్మన్‌గా ఎంపికయ్యారు. తదుపరి అప్పటి చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీకి ఉద్వాసన పలికాక 2017 ఫిబ్రవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement