
రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గింపు
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి...
న్యూఢిల్లీ: జీఎస్‌టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు టాటా మోటార్స్ సిద్ధమైంది. తన ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.75 వేల నుంచి రూ.1.45 లక్షల వరకు తగ్గించనున్నట్లు శుక్రవారం తెలిపింది. తగ్గింపు ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. చిన్న కార్ల విభాగంలోని టియాగోపై రూ.75వేల తగ్గింపు, టిగోర్‌పై రూ.80 వేలు, ఆల్ట్రోజ్‌పై రూ.1.10 లక్షల తగ్గింపు ఉంటుంది.
కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్‌పై రూ.85 వేలు, నెక్సాన్ కారుపై రూ.1.55 లక్షల తగ్గింపు అమలులోకి రానుంది. మిడ్ సైజ్ మోడల్ కర్వ్‌పై రూ.65 వేలు, ప్రీమియం ఎస్‌యూవీలు హారియర్‌పై రూ.1.40 లక్షలు, సఫారీపై రూ.1.45 లక్షల తగ్గింపు ఉండనుందని కంపెనీ పేర్కొంది.
‘‘దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి ఉద్దేశాలకు అనుగుణంగా... ‘వినియోగదారునికే తొలి ప్రాధాన్యత’ అనే మా సిద్ధాంతాన్ని అవలంబిస్తూ, జీఎస్టీ తగ్గింపుతో వచ్చిన లాభాన్ని ఎటువంటి కోత లేకుండా కస్టమర్లకే పూర్తిగా అందజేస్తున్నాం’’ అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం కొత్తగా వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రోత్సాహాన్నిస్తుందన్నారు.