రికార్డుల ర్యాలీ కొనసాగవచ్చు

Stock Market Experts Views and Advice - Sakshi

జాతీయ అంతర్జాతీయ సానుకూలతల ప్రభావం 

క్యూ1 ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి

పరిమిత శ్రేణి ట్రేడింగ్‌కు అవకాశం

నాలుగు ఐపీఓలు.., ఒక లిస్టింగ్‌  

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అభిప్రాయం  

ముంబై: స్టాక్‌మార్కెట్లో సూచీల ర్యాలీ ఈ వారంలోనూ కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధి ఊపందుకునేందుకు కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతామని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ ప్రకటించింది. దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి బుల్లిష్‌ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థలు అంచనాలకు తగ్గట్లు క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా మార్కెట్లు ఆల్‌టైం హై స్థాయిల వద్ద కదలాడుతున్నాయి. ఈ సానుకూల పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవుతూ సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గతవారంలో సూచీలు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1691 పాయింట్లు, నిఫ్టీ 16,238 పాయింట్లను ఆర్జించాయి.  

ఇక వారంలో క్యూ1 ఆర్థిక ఫలితాలు, జూన్‌ పారిశ్రామికోత్పత్తి, జూలై ద్రవ్యోల్బణ గణాంకాల(ఆగస్ట్‌ 12న విడుదల)తో పాటు ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. వర్షపాత నమోదు, కరోనా కేసులు, వ్యాక్సినేషన్‌ వార్తలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలు మార్కెట్లకు కీలకంగా మారనున్నాయి.  

‘‘మార్కెట్లో పాజిటివ్‌ ట్రెండ్‌ మరింతకాలం కొనసాగవచ్చు. పతనాన్ని కొనుగోళ్లకు అవకాశంగా భావించాలి. సాంకేతికంగా నిఫ్టీ 16,300 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16,500 – 16,600 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది’’ అని దీన్‌ దయాళ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సాంకేతిక నిపుణుడు మనీష్‌ హతిరామణి తెలిపారు.

చివరి దశకు క్యూ1 ఫలితాలు...  
దేశీయ కార్పొరేట్‌ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకటన చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో మొత్తం 1900 కంపెనీలు తమ క్యూ1 గణాంకాలను వెల్లడించున్నాయి. టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, భారత్‌ పెట్రోలియం, ఐషర్‌ మోటార్స్, శ్రీ సిమెంట్స్, ఎమ్‌ఆర్‌ఎఫ్, పవర్‌ గ్రిడ్, కోల్‌ ఇండియా, మదర్‌సన్‌ సుమీ, పిడిలైట్, క్యాడిల్లా హెల్త్‌కేర్, ఎన్‌ఎండీసీ, ఓఎన్‌జీసీ, గ్రాసీం, ఇంద్రప్రస్థ, తదితర కంపెనీలు ఉన్నాయి. ఇటీవల ఐపీఓను పూర్తి చేసుకొని ఎక్సే్చంజీల్లో షేర్లను లిస్ట్‌  చేసిన జొమాటో, క్లీన్‌ సైన్స్‌ టెక్నాలజీ కంపెనీలు సైతం ఇదే వారంలో తమ క్వార్టర్‌ ఫలితాలను వెల్లడించనున్నాయి.

మారిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి  
గత కొంతకాలంగా భారత ఈక్విటీలను అమ్మేసిన విదేశీ ఇన్వెస్టర్లు తాజాగా కొనుగోళ్లు చేపట్టారు. ఈ ఆగస్ట్‌ నెల తొలి ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో రూ.1,210 కోట్ల షేర్లను కొన్నారు. ఈ జూలైలో రూ.7,273 కోట్ల షేర్లను విక్రయించారు. ‘‘దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాయి. కార్పొరేట్‌ క్యూ1 ఫలితాలు మెప్పిస్తున్నాయి. ఈ అంశాలన్నీ విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు.  

రోలెక్స్‌ రింగ్స్‌ లిస్టింగ్‌ నేడు...
ఆటో ఉపకరణాల తయారీ సంస్థ రోలెక్స్‌ రింగ్స్‌ షేర్లు సోమవారం(ఆగస్ట్‌ 9న) ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ ఐపీఓ ఈ జూలై 28న మొదలై.., 30వ తేదీన ముగిసింది. షేరుకి రూ.900 గరిష్ట ధరతో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 731 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. చివరి రోజు నాటికి 130.43 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 56.85 లక్షల షేర్లను జారీ చేయగా.., ఏకంగా 74.15 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూ ధర రూ.900 తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.450ల ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్‌ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top