కొరియా చిన్నది.. కోట్ల సంపదలో పెద్దది!! | South Korea's Kim Jung-youn Named World's Youngest Female Tech Billionaire at 22 | Sakshi
Sakshi News home page

కొరియా చిన్నది.. కోట్ల సంపదలో పెద్దది!!

Apr 13 2026 2:06 PM | Updated on Apr 13 2026 2:24 PM

South Korea's Kim Jung-youn Named World's Youngest Female Tech Billionaire at 22

సాంకేతిక రంగం అంటేనే సృజనాత్మకతకు, అపారమైన సంపదకు నిలయం. తాజాగా ఈ రంగంలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. దక్షిణ కొరియాకు చెందిన 22 ఏళ్ల కిమ్ జంగ్-యున్ (Kim Jung-youn) ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా టెక్ బిలియనీర్‌గా ఫోర్బ్స్-2026 జాబితాలో నిలిచారు. గేమింగ్ రంగంలో ఆమె కుటుంబం సృష్టించిన సామ్రాజ్యం, నేడు ఆమెను ఈ అత్యున్నత స్థానంలో నిలబెట్టింది.

వారసత్వ సంపద.. అంతర్జాతీయ గుర్తింపు
గేమింగ్ దిగ్గజం 'నెక్సాన్' (Nexon) వ్యవస్థాపకుడు, దివంగత కిమ్ జంగ్-జు కుమార్తె జంగ్-యున్. 2022లో తన తండ్రి మరణం తర్వాత, నెక్సాన్ హోల్డింగ్ కంపెనీ అయిన NXCలో ఆమెకు, ఆమె సోదరి జంగ్-మిన్‌కు భారీగా వాటాలు దక్కాయి. ఫోర్బ్స్ తాజా గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 12, 2026 నాటికి జంగ్-యున్ నికర ఆస్తి విలువ 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,520 కోట్లు)

ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో నివసిస్తున్నారు. సంపద పరంగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం, సంస్థ నిర్వహణ విషయాల్లో చాలా గోప్యంగా ఉండటానికే మొగ్గు చూపుతారు.

నెక్సాన్.. గేమింగ్ రంగంలో ట్రెండ్ సెట్టర్
1994లో ప్రారంభమైన నెక్సాన్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. మాపుల్ స్టోరీ (MapleStory), డంజియన్ & ఫైటర్ (Dungeon & Fighter) వంటి ప్రపంచ ప్రసిద్ధ గేమ్స్ ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఏటా బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని ఆర్జిస్తూ, ఆసియా డిజిటల్ గేమింగ్ మార్కెట్‌లో నెక్సాన్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ బలమైన పునాదే నేడు జంగ్-యున్ సంపదకు ప్రధాన వనరు.

2026లో యువ బిలియనీర్ల హవా
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది 30 ఏళ్లలోపు వయస్సున్న బిలియనీర్ల సంఖ్య 35కు చేరింది. వీరి మొత్తం ఆస్తి విలువ సుమారు 92.4 బిలియన్ డాలర్లు. వీరిలో అత్యధికులు వారసత్వంగా ఆస్తులు పొందిన వారే అయినప్పటికీ, AI (కృత్రిమ మేధ) వంటి రంగాల్లో సొంతంగా ఎదిగిన వారు (Self-made) కూడా 12 మంది ఉండటం విశేషం. టెక్ రంగంలో జంగ్-యున్‌తో పాటు లువానా లోపెస్ లారా(కల్షి), లూసీ గువో (స్కేల్ ఏఐ) వంటి యువ మహిళామణులు కూడా సత్తా చాటుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement