
దేశీయంగా కొత్త గరిష్ట స్థాయి
తొమ్మిది నెలల్లో రూ.60,000 ప్లస్
రూ.1.20 లక్షలకు చేరిన పసిడి
న్యూఢిల్లీ: వెండి ధర తారాజువ్వలా దూసుకుపోతోంది. ఢిల్లీ మార్కెట్లో సోమవారం కిలోకి మొదటిసారి రూ.1.5 లక్షలు పలికింది. ఒకే రోజు రూ.7,000 లాభపడింది. మరోవైపు పసి డి ధర సైతం (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ. 1,500 పెరిగి రూ.1,19,500 వద్ద సరికొత్త జీవిత కాల గరిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి ఔన్స్ ధర (స్పాట్ మార్కెట్) 2 శాతం పెరిగి 47.18 డాలర్లకు చేరింది.
కామెక్స్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 46 డాలర్లు పెరిగి 3,855 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. విదేశీ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో దేశీ మార్కెట్లో వెండి, బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయిలకు చేరినట్టు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ విభాగం సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. ‘‘స్పాట్ గోల్డ్ ధరలు వరుసగా ఆరో వారంలో నూ కొత్త రికార్డులకు చేరా యి. వాణిజ్య అనిశ్చితులకు తోడు ఫెడ్ రేటు కోత అంచనాలు, ఈటీఎఫ్‌ల్లోకి బలమైన పెట్టుబడుల రాక ఇందుకు మద్దుతుగా నిలిచాయి’’అని మిరే అస్సెట్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్‌సింగ్ చెప్పారు.
వెండి 67 శాతం రాబడి..
ఈ ఏడాది వెండి, పసిడి ధరల పెరుగుదల ఇన్వెస్టర్లు, విశ్లేషకుల అంచనాలకు మించి ఉండడం గమనార్హం. వెండి కిలోకి నికరంగా రూ.60,300 పెరిగింది. 2024 డిసెంబర్ చివరికి ఉన్న రూ.89,700 నుంచి చూస్తే 67% రాబడిని ఇచ్చింది. పసిడి ధర సైతం ఈ ఏడాది ఇప్పటి వరకు 10 గ్రాములకు రూ.40,550 పెరిగింది. గత డిసెంబర్ చివరికి ఉన్న రూ.78,950 నుంచి చూస్తే 51 శాతం ర్యాలీ చేసింది.