వివరాల వెల్లడిలో కంపెనీల వైఫల్యం, సెబీ చీఫ్‌ ఆగ్రహం

Sebi Chief Ajay Tyagi Slams About Poor Disclosure Standards - Sakshi

న్యూఢిల్లీ: చాలా మటుకు కంపెనీలు ముఖ్యమైన వివరాల వెల్లడికి సంబంధించిన నిబంధనల స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించడం లేదని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్‌ అజయ్‌ త్యాగి వ్యాఖ్యానించారు. దీన్ని మొక్కబడి వ్యవహారంగా పరిగణించవద్దంటూ సంస్థలకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన వార్షిక క్యాపిటల్‌ మార్కెట్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ అంశాలు పేర్కొన్నారు. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్‌ కంపెనీలు తరచుగా జరిగే ఆర్థిక ఫలితాల్లాంటి అంశాలతో పాటు .. ఇతరత్రా పరిణామాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ‘ఈ రెండు విషయాలపైనా కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాలి. వార్షిక నివేదికల్లాంటి వాటిల్లో నిర్దేశిత అంశాలూ పొందుపరుస్తున్నప్పటికీ.. చాలా సందర్భాల్లో ఏదో మొక్కుబడిగా చేస్తున్నట్లుగా ఉంటోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అలాగే, చాలా కేసుల్లో మీడియాలో వార్తలు రావడం, వాటిపై వివరణ ఇవ్వాలంటూ కంపెనీలను స్టాక్‌ ఎక్సేంజీలను  కోరడం, ఆ తర్వాత ఎప్పుడో కంపెనీలు సమాధానాలు ఇవ్వడం జరుగుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. కంపెనీలు తమ విధానాలను పునఃసమీక్షించుకోవాలి.  నిబంధనలను కేవలం మొక్కుబడిగా కాకుండా వాటి వెనుక స్ఫూర్తిని అర్థం చేసుకుని పాటించాలి‘ అని త్యాగి పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాలు, వార్షిక నివేదికలు, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నివేదికలకు సంబంధించిన పత్రాలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు.
 
కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై దృష్టి పెట్టాలి .. 
ప్రస్తుత పరిస్థితుల్లో షేర్‌హోల్డర్, బోర్డు సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించడం మంచిదేనని త్యాగి చెప్పారు. అయితే, బోర్డు సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు గోప్యంగానే ఉంటున్నాయా, షేర్‌హోల్డర్ల సమావేశాల్లో వాటాదారుల గళానికి తగు ప్రాధాన్యమిస్తున్నారా లేదా అన్నవి తరచి చూసుకోవాల్సిన అంశాలని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాలు, పారదర్శకతను నిరంతరం మెరుగుపర్చుకోవడం అన్నది కంపెనీలో అంతర్గతంగా రావాలని త్యాగి చెప్పారు. నిర్వహణ బాగున్న కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకం ఏర్పడుతుందని, ఆయా సంస్థలకు దీర్ఘకాలంలో వాటి ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వీయ నిర్వహణను పరిశ్రమ సక్రమంగా పాటిస్తే నియంత్రణ సంస్థ ప్రతి సారి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉండదన్నారు.
  
పబ్లిక్‌ ఇష్యూల నిబంధనల్లో సంస్కరణలు .. 
ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో) నిబంధనల్లో .. ముఖ్యంగా బుక్‌ బిల్డింగ్, రేటు, ధర శ్రేణికి సంబంధించిన కొన్ని అంశాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టడంపై సెబీ కసరత్తు చేస్తోందని త్యాగి తెలిపారు. గత కొన్నాళ్లుగా నిధుల సమీకరణ ధోరణులు మారాయని, సెబీ కూడా తదనుగుణంగా నిబంధనలకు సవరణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైట్స్‌ ఇష్యూ, ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ నిబంధనల్లో పలు మార్పులు చేయడం, పెద్ద కంపెనీలు సులభంగా పబ్లిక్‌ ఇష్యూకి వచ్చేందుకు వీలు కల్పించేలా కనీస పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ను సవరించడం మొదలైనవి గత రెండేళ్లలో చేసినట్లు త్యాగి చెప్పారు. ప్రైవేట్‌ ఈక్విటీ, వెంచర్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు, స్టార్టప్‌ సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రమోటరు షేర్‌హోల్డింగ్‌ స్థానంలో నియంత్రణ వాటా కలిగిన షేర్‌హోల్డర్ల కాన్సెప్టును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు  తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చాపత్రం విడుదల చేసినట్లు వెల్లడించారు.
  
స్పాట్‌ మార్కెట్‌ ద్వారా పసిడి దిగుమతులు .. 
భవిష్యత్తులో పసిడిని ఎక్సే్చంజ్‌ వ్యవస్థ (ఎలక్ట్రానిక్‌ గోల్డ్‌ రిసీట్‌–ఈజీఆర్‌) ద్వారా దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సెబీ హోల్‌ టైమ్‌ సభ్యుడు జి. మహాలింగం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టర్కీ, చైనా వంటి దేశాల్లో ఈ విధానాన్ని పాటిస్తున్నారని ఆయన తెలిపారు. 995 స్వచ్ఛతకు మించిన బంగారం ఎక్సే్చంజ్‌ వ్యవస్థ ద్వారానే వచ్చేలా చూడాలని, దీంతో అది ఆర్థిక సాధనంగా మారుతుందని మహాలింగం చెప్పారు. ప్రస్తుతం భారత్‌ ఏటా 35 బిలియన్‌ డాలర్ల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోందని, ఎక్సే్చంజ్‌ మార్కెట్‌ వ్యవస్థలోకి మళ్లించడం వల్ల కరెంటు అకౌంటు లోటుపరమైన భారం తగ్గుతుందని  తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top