న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (69) వరుసగా ఆరో ఏడాదీ సున్నా వేతనంతోనే సరిపెట్టుకున్నారు. కంపెనీ వార్షిక నివేదిక లో ఈ విషయం వెల్లడైంది. 2008–09 ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ రూ.15 కోట్ల వార్షిక వేతనం అందుకున్నారు. అప్పటి నుంచి 2019–20 వరకు ఆయన పారితోషికంలో ఎలాంటి మార్పు లేదు. కానీ, కరోనా విపత్తు నేపథ్యంలో 2020–21లో వేతన ప్రయోజనాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.
భారీ డివిడెండ్ ఆదాయం: ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీకి రిలయన్స్‌లో ఉన్న వాటాల రూపంలో భారీ డివిడెండ్ ఆదాయం వస్తుండడం విశేషం. వ్యక్తిగతంగా ఆయన పేరిట ఉన్న 1.61 కోట్ల షేర్లపై రూ.9.66 కోట్ల డివిడెండ్ ఆదాయం 2024–25లో వచ్చింది. ఇక కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్ సంస్థలకు మొత్తంగా 664.5 కోట్ల షేర్లు (50.07% వాటా) ఉన్నాయి.
వీటి రూపంలో రూ.3,987 కోట్ల డివిడెండ్ ఆదాయం ప్రమోటర్ల గ్రూప్‌నకు వెళ్లింది. ఇక రిలయన్స్ గ్రూప్‌లో పనిచేసే అంబానీ సోదరులు నిఖిల్, హితల్ మేశ్వానీ ఎప్పటి మాదిరే గత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.25 కోట్ల చొప్పున అందుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వార్షిక ప్రయోజనాలు 2025–26లో రూ.20.58 కోట్లకు పెరిగాయి. ఇక అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రూ.12.17 కోట్లు లభించాయి.


