ఇన్వెస్టర్ గురూ, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా చేసిన ఫేస్‌బుక్ పోస్టులో ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “స్కూల్‌కి వెళ్లి, ఉద్యోగం సంపాదిస్తే భద్రత ఉంటుంది” అనే అత్యంత ఖరీదైన అబద్ధాన్ని ఇప్పటికీ 2026లోనూ తల్లిదండ్రులు తమ పిల్లలకు చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కియోసాకి పేర్కొన్న వివరాల ప్రకారం, 2025 సంవత్సరం ఉద్యోగుల పాలిట అత్యంత కఠినమైన కాలంగా మారింది. ఆ ఒక్క సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఉద్యోగాల కోతలు నమోదయ్యాయని, ఇది 2020 తర్వాత అత్యధికమని ఆయన తెలిపారు. అలాగే 2026 జనవరిలోనే 1,08,435 ఉద్యోగాలు ఊడిపోయాయనిఇ చెప్పారు.
టెక్నాలజీ రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కియోసాకి పేర్కొన్నారు. 2026లో ప్రతిరోజూ సగటున 1,003 మంది టెక్ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. అమెజాన్ జనవరిలో 16 వేల ఉద్యోగాలను తొలగించగా, మెటా మే నెలలో మరో 8 వేల ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోందని చెప్పారు. చెవ్రాన్ 8 వేల మందిని, డెల్ 11 వేల మందిని, సిటీగ్రూప్ 20 వేల మందిని తొలగించిందని, స్పిరిట్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో 17 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు.
ఈ పరిస్థితులకు కృత్రిమ మేధస్సు (AI) ప్రధాన కారణంగా మారుతోందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ఒక్క 2025లోనే ఏఐ కారణంగా అమెరికాలో 55 వేల ఉద్యోగాలు పోయాయని, 2026 ఏప్రిల్‌లో జరిగిన ఉద్యోగ కోతల్లో 26 శాతం ఏఐ కారణంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.
“ఇవేవీ విఫలమైన కంపెనీలు కావు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సంస్థలు. అయినా అత్యంత చదువుకున్న, నైపుణ్యం కలిగిన ఉద్యోగులే తొలగింపులకు గురవుతున్నారు” అని కియోసాకి వ్యాఖ్యానించారు. ఉద్యోగ భద్రత అనేది అసలు ఎప్పుడూ నిజం కాదని, ఉద్యోగంపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
తన తండ్రి ఉదాహరణను ప్రస్తావిస్తూ, “నా తండ్రి పీహెచ్‌డీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగి. ఒక్కరోజు కూడా పని మానలేదు. అయినా చివరికి అప్పులతోనే మరణించారు” అని ఆయన అన్నారు. విద్యాసంస్థలు మంచి ఉద్యోగులుగా తయారు చేస్తాయని, కానీ డబ్బు ఎలా పనిచేస్తుందో మాత్రం నేర్పవని విమర్శించారు.
డబ్బు వ్యవస్థపై మాట్లాడుతూ, “సేవింగ్స్‌లో డబ్బు ఉంచడం వల్ల ద్రవ్యోల్బణం నెమ్మదిగా దాన్ని తినేస్తుంది. ఉద్యోగుల ఆదాయం ఆగిపోయినప్పుడు వారికి ఆదాయం ఇచ్చే ఆస్తులు లేకపోవడమే అసలు సమస్య” అని ఆయన తెలిపారు.
తన చిన్నప్పుడే “రేపు ఉద్యోగం పోతే నీ ఆస్తుల ద్వారా ఎంతకాలం జీవించగలవు?” అని తన ‘రిచ్ డ్యాడ్’ అడిగిన ప్రశ్నను గుర్తుచేసుకున్న కియోసాకి, ఉద్యోగ భద్రత గురించి ఆలోచించే వారికంటే, “నేను ఏ ఆస్తిని నిర్మిస్తున్నాను?” అని ఆలోచించే వారే భవిష్యత్తులో నిలబడతారని పేర్కొన్నారు.
“ప్రపంచం మారిపోయింది. కానీ పాత సలహాలు మాత్రం మారలేదు. ఏఐ విప్లవం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది” అని కియోసాకి తన పోస్టులో హెచ్చరించారు.


