రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తొందరపడితే.. | Rental offers for open plots new real estate scam | Sakshi
Sakshi News home page

రూ.3 లక్షలకే రెండు గుంటలు.. తక్కువ ధర అని తొందరపడితే..

Mar 1 2025 7:13 PM | Updated on Mar 1 2025 7:29 PM

Rental offers for open plots new real estate scam

‘హైదరాబాద్‌ నుంచి 140 కి.మీ. దూరంలో ఉన్న నారాయణ్‌ఖేడ్‌లో ఓ నిర్మాణ సంస్థ ఫామ్‌ల్యాండ్‌ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తుంది. రెండు గుంటలు (242 గజాలు)కు రూ.3 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.15 వేల అద్దె చొప్పున 20 నెలల్లో తర్వాత మొదట్లో కట్టిన రూ.3 లక్షలతో సహా మొత్తం రూ.6 లక్షలు కొనుగోలుదారుడికి చెల్లిస్తోంది. అలాగే 4 గుంటల స్థలానికి రూ.6 లక్షలు చెల్లిస్తే.. ప్రతినెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ.12 లక్షలు, అలాగే 8 గుంటలకు రూ.12 లక్షలు కడితే.. నెలకు రూ.24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్‌ చేస్తుంది.’ ఇలా అపార్ట్‌మెంట్లకు ప్రతినెలా అద్దె చెల్లించినట్లుగానే ఓపెన్‌ ప్లాట్లకు, ఫామ్‌ల్యాండ్లకు కూడా రెంట్‌ చెల్లిస్తామని కొత్త తరహా మోసాలకు తెరలేపారు పలువురు బిల్డర్లు.  – సాక్షి, సిటీబ్యూరో

ఇప్పటికే గృహ నిర్మాణంలో ప్రీలాంచ్‌ విక్రయాల పేరిట జరిగిన దందాలో మోసపోయిన కొనుగోలుదారులు పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. కొత్తగా బై బ్యాక్, రెంటల్‌ ఇన్‌కం, ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ వంటి సరికొత్త ఆఫర్ల పేరిట అమాయకులను నట్టేట ముంచేస్తున్నారు.

  • ఫామ్‌ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తూ సామాన్యులను నిలువునా ముంచేస్తున్నారు. ఏడాదిలో అద్దెతో సహా కట్టిన సొమ్మును వాపస్‌ ఇస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు. ఒకవేళ ఏడాది తర్వాత మార్కెట్‌ ఒడిదుడుకులలో ఉన్నా లేక కంపెనీ బోర్డు తిప్పేసినా నష్టపోయేది కొనుగోలుదారుడే. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం గజానికి రూ.5 వేలు కూడా పలకని ప్రాంతంలో రూ.10 వేలకు పైగానే ధరతో విక్రయించి.. ముందస్తుగానే బిల్డర్లు సొమ్ము వసూలు చేసేస్తున్నారు.  

  • కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్‌ఫ్రాకాన్, జయగ్రూప్, ఫార్చ్యూన్‌ 99 వంటి పలు కొత్త నిర్మాణ సంస్థలు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. డీటీసీపీ, హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు చేయకుండానే వెంచర్లను విక్రయిస్తున్నారు. సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి ప్రధాన నగరం నుంచి వందకుపైగా కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్ట్‌లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు.

నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. 
గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్‌ ఉద్యోగులను రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్‌ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతినెలా స్టార్‌ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు.

ఇదీ చదవండి: లగ్జరీ రియల్‌ ఎస్టేట్‌.. మంచి లాభాలకు ఇదే రూట్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement