భారత్‌లో 7–లెవెన్‌ స్టోర్స్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌లో 7–లెవెన్‌ స్టోర్స్‌

Published Fri, Oct 8 2021 4:28 AM

Reliance Retail to launch 7-Eleven convenience stores in India - Sakshi

న్యూఢిల్లీ: దేశీ రిటైల్‌ దిగ్గజం రిలయన్స్‌ రిటైల్‌ తన సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరిస్తోంది. తాజాగా అమెరికాకు చెందిన 7–లెవెన్‌ కనీ్వనియెన్స్‌ స్టోర్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇందుకు సంబంధించి 7–లెవెన్‌ (ఎస్‌ఈఐ)తో తమ అనుబంధ సంస్థ 7–ఇండియా కన్వీనియన్స్‌ రిటైల్‌ సంస్థ మాస్టర్‌ ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. మొదటి స్టోర్‌ను అక్టోబర్‌ 9న ముంబైలో ప్రారంభించనున్నట్లు ఆర్‌ఆర్‌వీఎల్‌ వివరించింది. ఆ తర్వాత వేగంగా మిగతా ప్రాంతాల్లో కూడా విస్తరించనున్నట్లు పేర్కొంది.

‘మా కస్టమర్లకు అత్యుత్తమమైనవి అందించాలన్నది మా లక్ష్యం. అందులో భాగంగా 7–లెవెన్‌ను ప్రవేశపెడుతుండటం మాకు గర్వకారణం. అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్‌లలో ఇది ఒకటి‘ అని సంస్థ డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు. ‘భారత్‌ .. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద దేశం. అలాగే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. ప్రపంచంలోనే అతి పెద్ద కనీ్వనియెన్స్‌ రిటైలర్‌ సంస్థల్లో ఒకటైన మా కంపెనీ .. భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయం‘ అని 7–లెవెన్‌ ప్రెసిడెంట్‌ జో డిపింటో తెలిపారు. స్నాక్స్, శీతల పానీయాలు, నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తులు కొనుగోలు చేసే కస్టమర్లకు విశిష్టమైన షాపింగ్‌ అనుభూతిని అందించడం తమ స్టోర్స్‌ లక్ష్యమని పేర్కొన్నారు.

18 దేశాల్లో 77,000 స్టోర్స్‌ ..
అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌ఈఐకి 18 దేశాలు.. ప్రాంతాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. స్వీయ నిర్వహణను, ఫ్రాంచైజీ/లైసెన్సుల రూపంలోను కలిపి 77,000 పైచిలుకు స్టోర్స్‌ ఉన్నాయి. ఉత్తర అమెరికాలోనే ఏకంగా 16,000 పైగా స్టోర్స్‌ నిర్వహిస్తోంది. 7–లెవెన్‌ స్టోర్స్‌తో పాటు స్పీడ్‌వే, స్ట్రైప్స్, లారెడో, టాకో కంపెనీ, రైజ్‌ ది రూస్ట్‌ వంటి ఫ్రాంచైజీలను కూడా ఎస్‌ఈఐ నిర్వహిస్తోంది. వాస్తవానికి 7–లెవెన్‌ స్టోర్స్‌ను దేశీ సూపర్‌మార్కెట్‌ దిగ్గజం ఫ్యూచర్‌ రిటైల్‌ .. భారత్‌లో ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం 2019 ఫిబ్రవరిలో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

కానీ ఫ్యూచర్‌ రిటైల్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇరు సంస్థలు పరస్పర అంగీకారంతో ఒప్పందం రద్దు చేసుకున్నాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌ తమ రిటైల్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌కే విక్రయించేందుకు ప్రయతి్నస్తోంది. కానీ ఫ్యూచర్‌లో వాటాలు ఉన్న ఈ–కామర్స్‌ దిగ్గజం దీన్ని వ్యతిరేకిస్తుండటంతో డీల్‌ ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో 7–లెవెన్‌తో రిలయన్స్‌ రిటైల్‌ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు దేశవ్యాప్తంగా ఇప్పటికే 13,000 పైగా స్టోర్స్‌ ఉన్నాయి. 2021 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 1,57,629 కోట్ల టర్నోవరు (కన్సాలిడేటెడ్‌) నమోదు చేసింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement