ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కే కాదండోయ్‌..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్‌ పెరిగింది..!

Real Estate Consultant Jll India Says Ev House Demand Increase - Sakshi

Jll India Says Ev House Demand Increase: ఇంధన వనరుల ధరలు రోజుకో రేటు ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వైపు మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ఈవీ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో చార్జింగ్‌ స్టేషన్ల అవసరం పెరిగింది. ఒకవైపు పెట్రోల్‌ బంక్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద  ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటవుతుంటే.. మరోవైపు కొత్తగా నిర్మిస్తున్న నివాస, వాణిజ్య సముదాయాలలోనూ వీటిని నెలకొల్పుతున్నారు. జిమ్, స్విమ్మింగ్‌ పూల్‌ అంటూ ప్రకటించే వసతుల జాబితాలో ఈవీ చార్జింగ్‌ పాయింట్‌ అనే ప్రత్యేకంగా ప్రకటించే స్థాయికి చేరిందంటే ఆశ్చర్యమేమీ లేదు. దీంతో ప్రస్తుతమున్న సాధారణ నివాస భవనాలలో ధరలు 1 శాతం మేర పెరిగితే.. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసిన నివాస భవనాలలో ధరలు 2–5 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్‌ఎల్‌ నివేదిక తెలిపింది. 

2030 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా 40 శాతం కంటే ఎక్కువకు చేరుతుంది. దీంతో ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు ఉన్న భవనాలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతుంది. కొత్త ప్రాజెక్ట్‌ల్లోనే కాకుండా ఇప్పటికే ఉన్న భవనాలలో కూడా ఈవీ పాయింట్ల ఏర్పాటు వ్యవస్థ 2026 నాటికి భారీగా పెరుగుతుంది. భవనాల రకం, సహజ వనరుల పునర్వినియోగ (రెట్రోఫిట్‌) ప్రాజెక్ట్‌ల నివాస తరగతులను బట్టి ధరల పెరుగుదల ఉంటుంది. ప్రస్తుతం నివాస ప్రాంతాలలో యజమానులు సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయంతో ఈవీ స్టేషన్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో అసోసియేషన్లు వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. ఇందుకోసం వినియోగదారులపై నిర్ణీత రుసుములను వసూలు చేస్తున్నారు. కొత్త నివాస సముదాయాలలో 5 శాతం పార్కింగ్‌ స్థలాన్ని ఈవీ చార్జింగ్‌ స్టేషన్ల కోసం కేటాయించబడతాయని జేఎల్‌ఎల్‌ ఇండియా స్ట్రాటర్జిక్‌ కన్స ల్టింగ్‌ అండ్‌ వాల్యుయేషన్‌ అడ్వైజరీ హెడ్‌ ఏ శంకర్‌ తెలిపారు. ఈవీ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐఓటీ) చార్జింగ్‌ ఉపకరణాలు, ఇంటర్నెట్‌ లభ్యత కూడా అందుబాటులో ఉండాలి గనక.. ఇప్పటికే ఉన్న భవనాలలో చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటుకు 1 శాతం ప్రీమియం ఉంటుందని పేర్కొన్నారు. 

ఆఫీస్‌ స్పేస్‌లలో కూడా.
ఈవీ స్టేషన్లు ఉన్న ఆఫీస్‌ స్పేస్‌లకు కూడా డిమాండ్‌ ఏర్పడింది. కొందరు స్థల యజమానులు వినియోగదారు రుసుముతో ఈవీ స్టేషన్ల సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరికొందరు చార్జింగ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు భూమిని లీజుకు లేదా రెవెన్యూ షేర్‌ మోడల్‌ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కొన్ని కార్యాలయాలలోని పార్కింగ్‌లలో ఇలాంటి అవసరాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాయి. ప్రభుత్వ విభాగాలు చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసి వాటిని ప్రైవేట్‌ ఆపరేట్లకు లీజుకు ఇవ్వొచ్చు లేదా దీర్ఘకాలానికి సంబంధిత భూమిని సర్వీస్‌ ప్రొవైడర్లకు లీజుకు ఇవ్వొచ్చని జేఎల్‌ఎల్‌ సూచించింది. 

అమేయాలో 20 ఈవీ స్టేషన్లు 
మియాపూర్‌లో నిర్మిస్తున్న అమేయా ప్రాజెక్ట్‌లో 20 హైస్పీడ్‌ ఈవీ చార్జింగ్‌ పాయింట్లుంటాయి. కొనుగోలుదారుల అవసరం మేరకు ప్రతి పార్కింగ్‌ ప్లేస్‌లో అదనంగా మరో పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏరియాలో ఈవీ స్టేషన్లతో నిర్మిస్తున్న మొదటి ప్రాజెక్ట్‌ ఇదే. 10 ఎకరాల్లో మొత్తం 1,066 అపార్ట్‌మెంట్లుంటాయి. – టీవీ నర్సింహా రెడ్డి, సీఎండీ, అస్పైర్‌ స్పేసెస్‌ 

చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top