వృద్ధికి ఒమిక్రాన్‌ ముప్పు

RBI flags Omicron threat to growth - Sakshi

సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్టంగానే బ్యాంకులు

ప్రైవేట్‌ పెట్టుబడులు, వినియోగం ఇంకా పుంజుకోవాలి

రెండో ఆర్థిక స్థిరత్వ నివేదికలో రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడి

ముంబై:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ, ఎకానమీ స్థిరంగా ముందుకు సాగుతున్నప్పటికీ వృద్ధి సాధనకు ఒమిక్రాన్‌ వేరియంట్‌పరంగా ముప్పు ఇంకా పొంచే ఉంది. దీనికి ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్లు కూడా తోడయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో ఆర్థిక స్థిరత్వ నివేదిక ముందుమాటలో రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ విషయాలు వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌–మే మధ్యలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ పెను విధ్వంసం సృష్టించిన తర్వాత వృద్ధి అంచనాలు క్రమంగా మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్‌ పెట్టుబడులు, ప్రైవేట్‌ వినియోగం గణనీయంగా పెరగడంపై నిలకడైన, పటిష్టమైన రికవరీ ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు ఈ రెండూ ఇంకా మహమ్మారి పూర్వ స్థాయులకన్నా దిగువనే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ అంశం ఆందోళనకరంగానే ఉందని అంగీకరించిన దాస్‌.. ఆహార, ఇంధన ధరల కట్టడి చేసే దిశగా సరఫరావ్యవస్థను పటిష్టం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  

దీటుగా నిల్చిన ఆర్థిక సంస్థలు..
మహమ్మారి విజృంభించిన వేళలోనూ ఆర్థిక సంస్థలు గట్టిగానే నిలబడ్డాయని దాస్‌ తెలిపారు. ఇటు విధానపరంగా అటు నియంత్రణ సంస్థపరంగాను తగినంత తోడ్పాటు ఉండటంతో ఆర్థిక మార్కెట్లలో స్థిరత్వం నెలకొందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకుల దగ్గర పుష్కలంగా మూలధనం, నిధులు ఉండటంతో భవిష్యత్‌లోనూ ఎలాంటి సవాళ్లు వచ్చినా తట్టుకుని నిలబడగలవని దాస్‌ చెప్పారు. స్థూల ఆర్థిక.. ఆర్థిక స్థిరత్వంతో పటిష్టమైన, నిలకడైన సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు తోడ్పడేలా ఆర్థిక వ్యవస్థను బలంగా తీర్చిదిద్దేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని ఆయన వివరించారు.  

రిటైల్‌ రుణాల విధానాలపై ఆందోళన..
రిటైల్‌ రుణాల క్వాలిటీ అంతకంతకూ క్షీణిస్తుండటంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం .. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ తొలి వారం మధ్యలో రుణ వితరణ 7.1 శాతం (అంతక్రితం ఇదే వ్యవధిలో 5.4 శాతం) వృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో హోల్‌సేల్‌ రుణాలు వెనక్కి తగ్గగా.. వృద్ధి వేగం ఇంకా మహమ్మారి పూర్వ స్థాయి కన్న తక్కువగానే ఉన్నప్పటికీ .. రిటైల్‌ రుణాలు మాత్రం రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతున్నాయని నివేదిక పేర్కొంది.

గత రెండేళ్లలో నమోదైన రుణ వృద్ధిలో హౌసింగ్, ఇతర వ్యక్తిగత రుణాల వాటా 64 శాతం మేర ఉంది. రిటైల్‌ ఆధారిత రుణ వృద్ధి విధానం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోందని నివేదిక తెలిపింది. కన్జూమర్‌ ఫైనాన్స్‌ పోర్ట్‌ఫోలియోలో ఎగవేతలు పెరిగినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పెరిగిన రుణ వితరణలో రిటైల్‌ / వ్యక్తిగత రుణాల వాటా 64.4%గా (అంతక్రితం ఇదే వ్యవధిలో 64.1%) ఉంది. ఇందులో హౌసింగ్‌ రుణాల వాటా 31.2 శాతంగా (అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో 30%) నమోదైంది.

ఎన్నారైలు స్థిరాస్తులు కొనేందుకు.. ముందస్తు అనుమతులు అక్కర్లేదు..
కొన్ని సందర్భాల్లో మినహా ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), ఓసీఐలు (ఓవర్‌సీస్‌ సిటిజన్స్‌ ఆఫ్‌ ఇండియా) భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి లేదా బదిలీ చేయించుకోవడానికి ముందస్తుగా ఎటువంటి అనుమతులు అవసరం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. వ్యవసాయ భూమి, ఫార్మ్‌ హౌస్, ప్లాంటేషన్‌ ప్రాపర్టీలకు మాత్రం ఇది వర్తించదని తెలిపింది. ఓఐసీలు భారత్‌లో స్థిరాస్తులను కొనుగోలు చేసే నిబంధనలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మేరకు వివరణనిచ్చింది.   

మొండిబాకీలు పెరుగుతాయ్‌..
ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న పక్షంలో బ్యాంకుల స్థూల మొండిబాకీలు (జీఎన్‌పీఏ) వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఏకంగా 8.1–9.5 శాతానికి ఎగియవచ్చని ఆర్థిక స్థిరత్వ నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 6.9 శాతంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జీఎన్‌పీఏలు 8.8 శాతంగా ఉండగా 2022 సెప్టెంబర్‌ నాటికి ఇవి 10.5 శాతానికి ఎగియవచ్చని అంచనా. అలాగే ప్రైవేట్‌ బ్యాంకుల్లో 4.6 శాతం నుంచి 5.2 శాతానికి, విదేశీ బ్యాంకుల్లో 3.2 శాతం నుంచి 3.9 శాతానికి పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది. విభాగాలవారీగా చూస్తే వ్యక్తిగత, హౌసింగ్, వాహన రుణాల్లో జీఎన్‌పీఏ పెరిగింది. మరోవైపు, ఫుడ్‌ ప్రాసెసింగ్, రసాయనాలు వంటి కొన్ని ఉప–విభాగాలు మినహాయిస్తే పారిశ్రామిక రంగంలో జీఎన్‌పీఏల నిష్పత్తి తగ్గుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top