
ఫారం 16. దీనికి సంబంధించి ఎన్నెన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు.. అలాగే వాటికి జవాబులు ఇక్కడ తెలుకుందాం.
ఇదివరకే చాలాసార్లు దీనికి సమాధానం రాశాం. ముందుగా ఆదాయాన్ని లెక్కించండి. అంటే .. అందులో ఏయే అంశాలున్నాయనేది చూసుకోండి. ఉదాహరణకు వేతనమా? ఇంటి మీద అద్దె? వ్యాపారమా? ఉద్యోగం చేస్తున్నారా? క్యాపిటల్ గెయిన్స్ ఉన్నాయా? ఇవన్నీ కాకుండా అదనంగా ఇంకా ఏమేమి ఆదాయాలు ఉన్నాయి, మొత్తంగా ఎన్ని ఉన్నాయో తెలుసుకొని ఒక పద్ధతి ప్రకారం క్రమంగా వ్రాయండి. ఇలా చేయడానికి మీరు కాస్త కసరత్తు చేయాలి. జీతానికి సంబంధించిన వివరాలు, అలాగే పెన్షన్ వివరాలు.. ఒక ఏడాది కాలంలో యాజమాని లేదా ఉద్యోగం మారారా? మారితే ఫారం 16 ఇచ్చారా ? అందులో ఎంత జీతం చూపించారు. ఇద్దరూ చెరొకసారి స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారా? అలా ఇవ్వకూడదు. అలాగే ఇద్దరూ బేసిక్ లిమిట్ పరిగణలోకి తీసుకున్నారా? అలా తీసుకోకూడదు.
చాలా మంది స్టాండర్డ్ డిడక్షన్‌ని, బేసిక్ లిమిట్‌ని రెండు చోట్ల తీసుకొని.. ఎక్కడా పన్ను భారం లేదు కదా అని మురిసిపోతుంటారు. తీరా రెండూ కలిపి లెక్కలు తీసి, పన్ను భారం వేసేసరికి షాక్ అవుతుంటారు. కొందరు యజమానులను, కన్సల్టెంట్లను తిట్టుకుని, ఇరుగు పొరుగుని సంప్రదించి ఎగవేతల వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుని సంతోషపడినా.. మరొక దూరపు బంధువు జాగ్రత్తల జగన్నాధం అలాంటి ‘శషభిషలు’ పనికి రావు అని శాసిస్తే.. చివరికి సరైన దారిలోకి వస్తుంటారు.
అంటే రెండు చోట్లా డిడక్షన్లు క్లయిం చేస్తారు. యజమాని సహకారం, ఉదాసీనత, అరకొర జ్ఞానం, మిడిమిడి జ్ఞానం మొదలగు వాటి ముసుగులో హెచ్‌ఆర్‌ఏ విషయంలో దొంగ రశీదులు, ఎక్కువ చెల్లించినట్లు రశీదులు, చనిపోయిన మావగారింట్లో చూరుపట్టుకొని వేలాడుతూ ఇల్లరికం అల్లుడిలా చెలామణి అవుతూ, మావగారి సంతకంతో ఒక రశీదు పడేస్తారు.
ఆఫీసులో కొంతమంది ప్రబుద్ధులు, భార్యభర్తలు .. అద్దె చెల్లించకుండా, తండ్రి ఇంట్లో ఉచితంగా ఉంటూ, ఇద్దరూ హెచ్‌ఆర్‌ఏ విషయంలో క్లెయిం చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొందరు సొంత ఇంట్లోనే ఉంటూ, తన పేరు మీదే ఇల్లు ఉన్నా, గతంలో ఒక ఇల్లు/వాకిలి/స్థలం అమ్మేసిన సొమ్ము వస్తే, ఆ సంగతి ఆదాయపు పన్ను శాఖ వారికి చెప్పకుండా, అదృష్టం బాగుండి ఏ అప్పూ లేకుండా ఇల్లు పూర్తి చేస్తుంటారు. తన పేరు మీదే మున్సిపల్ ట్యాక్స్ చెల్లించినా కూడా హెచ్‌ఆర్‌ఏ సంగతి గుర్తుకు రాగానే, కంగుతిని, భార్యామణి చేత సంతకం పెట్టించి, ఆమెనే ఓనరుగా చూపించి హెచ్‌ఆర్‌ఏ క్లెయిం చేస్తుంటారు. అలాగే యజమాని సహకారం/ ప్రేమ/ జాలి / కరుణ గల ఉద్యోగ రత్నాలు తమకు వర్తించే అన్ని డిడక్షన్లు క్లెయిం చేస్తున్నారు. ఒక విధంగా దొంగ క్లెయిమ్‌లు చూపించి, వాటిని ఫారం 16లో పొందుపరిచి, వాటికి పవిత్రను ఆపాదించే ఉద్యోగ రాయుళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి: ఫారం 16లో జరిగిన మార్పులు.. గమనించారా?
అందుకే కాబోలు...డిపార్ట్‌మెంట్ వారు కఠినంగా వ్యవహరించేందుకు సన్నద్ధులు అయ్యారు. ఆ యుద్ధం చేసే ముందు ఒక మంచి అవకాశం ఇస్తున్నారు. అదేమిటంటే ప్రతి డిడక్షన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆ కాగితాలను జతపరచకపోయినా వాటిలోని వివరాలు చాలా ఇవ్వాలి. ఇస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఇవ్వకపోతే క్లెయిమ్/డిడక్షన్ ఇవ్వరు. ఫారంలో వివరాలు ఇస్తే గనుక, రిటర్నులు దాఖలు చేయాలి. ఫారం 16 అంశాలు సమీక్షించి సరైన కాగితాలు సమకూర్చుకుని, సన్నద్ధం కండి.
ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి & కె.వి.ఎన్ లావణ్య