పాకిస్థాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్ | Qatar Suspends Visa on Arrival for Pakistan West Asia Conflict | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్

Apr 2 2026 12:05 PM | Updated on Apr 2 2026 1:05 PM

Qatar Suspends Visa on Arrival for Pakistan West Asia Conflict

‘వీసా ఆన్‌ అరైవల్‌’పై ఆంక్షలు

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రాయబార కార్యాలయం ప్రకటన

వీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్‌ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్‌ ఎంబసీ స్పష్టం చేసింది.

ఎవరిపై ప్రభావం?

ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్‌ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.

ఎందుకీ నిర్ణయం

ఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్‌, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.

దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదన

మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్‌ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్‌ హార్మూజ్‌ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్‌, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది!

Advertisement
 
Advertisement
Advertisement