దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపయోగంగా ఉన్న లక్షలాది ఖాతాలను రేపటి (ఏప్రిల్ 16) నుండి శాశ్వతంగా మూసివేయాలని బ్యాంక్ యాజమాన్యం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇతర ప్రభుత్వ బ్యాంకుల బాటలోనే పీఎన్‌బీ కూడా ఈ కఠిన చర్యలకు ఉపక్రమించడం బ్యాంకింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
ఎవరి ఖాతాలు మూతపడతాయి?
మీడియా నివేదికల ప్రకారం.. ఈ కింది కేటగిరీల కిందకు వచ్చే ఖాతాలను బ్యాంక్ మూసివేయనుంది.
మూడేళ్లుగా లావాదేవీలు లేనివి: గత మూడేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా వాడని ఖాతాలు.
జీరో బ్యాలెన్స్: ఖాతాలో జీరో బ్యాలెన్సు ఉండి, చాలా కాలంగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న ఖాతాలు.
కేవైసీ అప్‌డేట్ లేనివి: గడువులోపు e-KYC (ఈ-కేవైసీ) పూర్తి చేయని ఖాతాలపై బ్యాంక్ వేటు వేసే అవకాశం ఉంది.
ఎందుకీ కఠిన నిర్ణయం?
బ్యాంకులో వేల సంఖ్యలో నిరుపయోగంగా పడి ఉన్న ఖాతాల వల్ల మోసాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్యాంక్ భావిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా, అలాగే బ్యాంక్ డేటాను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో క్రమానుగతంగా ఇటువంటి చర్యలు చేపడుతుంటారు.
ఖాతాను కాపాడుకోవాలంటే..
మీ ఖాతా క్లోజ్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ కింది పనులు పూర్తి చేయండి:
మీ సమీపంలోని పీఎన్‌బీ బ్రాంచ్‌కు వెళ్లి వెంటనే ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయండి.
మీ అకౌంట్‌లో కొంత మొత్తాన్ని జమ చేయండి.
కనీసం ఒక చిన్న లావాదేవీ (డ్రా చేయడం లేదా జమ చేయడం) చేయడం ద్వారా అకౌంట్ యాక్టివ్‌గా ఉందని నిర్ధారించుకోండి.
తీసుకెళ్లాల్సిన పత్రాలు
ఈ పనుల నిమిత్తం బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యుత్ లేదా నీటి బిల్లు (అడ్రస్ ప్రూఫ్ కోసం), బ్యాంక్ పాస్‌బుక్ ఒరిజినల్ పత్రాలతో పాటు వాటి ఫోటోకాపీలను (జిరాక్స్) వెంట తీసుకెళ్లడం మర్చిపోకండి.
ఇదీ చదవండి: పోస్టాఫీసు స్కీములు.. అత్యధిక వడ్డీలు


