భళా: భారత్‌లో పేదరికం తగ్గుతోంది, 'పీఎంజీకేఏవై' పై ప్రశంసల వర్షం!

PM Garib Kalyan Yojana Minimizing Extreme Poverty Says IMF - Sakshi

న్యూఢిల్లీ: పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) విశ్లేషించింది. ఈ  పథకం వల్ల కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొంది.

‘మహమ్మారి, పేదరికం, అసమానత: భారతదేశం నుంచి పాఠాలు’  అనే అంశంపై ఈ వర్కింగ్‌ పేపర్‌ రూపొందింది. 2004–05 నుంచి మహమ్మారి సవాళ్లు విసిరిన 2020–21 ఆర్థిక సంవత్సరం వరకూ భారతదేశంలో పేదరికం, వినియోగ అసమానతలపై ఈ పత్రం అధ్యయనం చేసింది. సుర్జిత్‌ ఎస్‌ భల్లా, కరణ్‌ భాసిన్, అరవింద్‌ విర్మానీలు రూపొందించిన ఈ వర్కింగ్‌ పేపర్‌లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

2019లో కరోనా ముందు సంవత్సరంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద ఉంది.  2020 మహమ్మారి సంవత్సరంలోనూ అది తక్కువ స్థాయిలోనే కొనసాగాలా చూడ్డంలో ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన  కీలకపాత్ర పోషించింది.  

మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యా లను ఉచితంగా అందిస్తోంది.  సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్‌ వరకూ ఈ పథకాన్ని పొడిగించడం సానుకూల పరిణామం.  

 2019–20 మహమ్మారికి ముందు సంవత్సరంలో భారతదేశంలో పేదరికం 14.8 శాతంగా ఉంటే, తీవ్ర పేదరికం శాతం 0.8 శాతంగా ఉంది.  

ఏదు దశాబ్దాల్లో మొట్టమొదటిసారి ప్రపంచ వ్యాప్తంగా 2020 మహమ్మారి సమయంలో పేదరికం (రోజుకు 1.9 డాలర్లకన్నా తక్కువ ఆర్జన) తీవ్రంగా పెరిగింది.  

► మహమ్మారి సమయంలో భారత్‌ ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యల వల్ల పేదరికం తీవ్రత కట్టడిలో ఉంది. 2013లో ఆహార భద్రతా చట్టం (ఎఫ్‌ఎస్‌ఏ) అమలులోకి వచ్చినప్పటి నుండి ఆహార సబ్సిడీలు పేదరికాన్ని స్థిరంగా తగ్గించాయి. ప్రయోజనాలు అసలైన లబ్దిదారులకు చేరడం  ఆధార్‌ ద్వారా సాధ్యపడుతోంది. లబ్దిదారునికి సబ్బిడీ పథకాలు చేరేలా తీసుకువచ్చిన చర్యలు, చొరవలు పేదరికం తగ్గడంలో మంచి ప్రభావాన్ని పోషించాయి.  

గిని కోఎఫీషియంట్‌ విధానం ద్వారా మదింపుచేసే గణాంకాల ప్రకారం, గత నలభై సంవత్సరాలలో ‘‘వాస్తవిక అసమానత’’ కనిష్ట స్థాయికి చేరుకుంది. 1993–94లో అసమానతల నివారణా  సూచీ 0.284 వద్ద ఉంటే,  2020–21లో 0.292కి చేరుకుంది. ఆహార సబ్సిడీల వల్ల మూడు సంవత్సరాలుగా తీవ్ర పేదరికం 1 శాతం కంటే తక్కువగా (లేదా సమానంగా) ఉంది.  

ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత 2020లో మొదటిసారి జనాభాలో మూడింట రెండు వంతుల మంది ప్రజలకు అవసరమైన ప్రాథమిక ఆహార రేషన్‌ను ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోంది. 

తీవ్ర పేదరిక సమస్య వాస్తవంగా భారత్‌లో పోయిందనే చెప్పాలి. ఇందుకు సంబంధించి ప్రాతిపదికైన ఆర్జన ఇకపై 1.9 డాలర్ల నుంచి 3.2 డాలర్లకు పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్‌ అధికారికంగా దేశంలో దారిద్య్రరేఖ ప్రాతిపదికలను మార్చాలి.  

దేశంలో మహమ్మారి వల్ల తలెత్తిన తీవ్ర పేదరిక సమస్య  ఆహార సబ్సిడీ విస్తరణ కార్యక్రమం వల్ల  దాదాపు 50 శాతం మేర సమసిపోయింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top