Vodafone Idea : ట్విస్ట్‌ ఇచ్చిన కేంద్రం.. కంపెనీ ఆశలపై నీళ్లు!

No role In Vodafone Idea Operations Centre After Major Share Hold - Sakshi

Govt Not Interested in Supervising Vodafone Idea Operations: భారత టెలికాం రంగంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం కంపెనీగా ఉన్న వొడాఫోన్‌-ఐడియా తన మేజర్‌ వాటాను కేంద్రం చేతికి అప్పగించింది. దీంతో కార్యనిర్వాహణ, కీలక నిర్ణయాలు ప్రభుత్వమే తీసుకోనుందని.. మంచిరోజులు రాబోతున్నాయంటూ కంపెనీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కేంద్రం ఆ ఆశలపై నీళ్లు జల్లింది. 

కంపెనీలో మేజర్‌ వాటా దక్కించుకున్నప్పటికీ.. వొడాఫోన్‌ ఐడియా కంపెనీ కార్యకలాపాల పర్యవేక్షణ, నిర్వహణలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు బోర్డు నిర్ణయాలను సైతం ప్రభావితం చేయబోదని పేర్కొంది. వొడాఫోన్‌-ఐడియాను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. బోర్డు సీటుపై ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు.  నష్టాల్లో ఉన్న టెల్కో స్థిరపడిన వెంటనే..  నిష్క్రమించాలని ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 

ఇక వొడాడియా ఆఫర్ చేసిన వాటాను..  ప్రభుత్వ ఈక్విటీగా మార్చే విధానంపై టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) త్వరలో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపనుందని అధికారులు వెల్లడించారు(దాదాపు ఖరారైనట్లే!). మొత్తం వడ్డీ బకాయిలను ఈక్విటీగా మార్చేయగా.. రూ. 16,000 కోట్లకుగానూ 35.8 శాతం వాటాను వొడాఫోన్‌-ఐడియా కంపెనీ, కేంద్రానికి అప్పజెప్పేందుకు సిద్ధమైంది. దీంతో కంపెనీలో గరిష్ఠ వాటా దక్కడంతో.. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే చూసుకోనుందంటూ(మరో బీఎస్‌ఎన్‌ఎల్‌గా మారనుందంటూ సోషల్‌ మీడియాలో సెటైర్లు సైతం) కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ చేతికి మేజర్‌ వాటాను అప్పజెప్పడం ద్వారా లబ్ధి పొందవచ్చని భావించిన కంపెనీకి.. అధికారుల తాజా ప్రకటనతో నిరాశే ఎదురైంది. కేవలం టెలికాం సంస్కరణల ప్యాకేజీ ద్వారా లిక్విడిటీకి తీసుకురావడం, టెలికాం కంపెనీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడటం లాంటి చర్యలకు మాత్రమే ప్రభుత్వం పూనుకోనుందట. ఇక ఓటింగ్ హక్కులు, PSU(పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌టేకింగ్‌)గా మార్చడం, డైరెక్టర్ల బోర్డులో స్థానం పొందడంలాంటి ఆలోచనలు ప్రభుత్వానికి లేదనే స్పష్టత లభించింది. మరోవైపు ఇన్వెస్టర్లలో ధైర్యం నింపేందుకే ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించిందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.దీంతో కంపెనీ ఇక మీదట కూడా స్వతంత్రగా కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.

అందులో భాగంగానే..
కొంతకాలంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న టెలికాం రంగానికి మేలు చేసే యోచనతో గతేడాది కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమన ప్యాకేజీని ప్రకటించించింది. ఇందులో భాగంగానే టెలికం కంపెనీలు.. స్పెక్ట్రమ్‌ వాయిదాలు, ఏజీఆర్‌ బకాయిలపై చెల్లించవలసిన నాలుగేళ్ల కాలపు వడ్డీ వాయిదాలను ఎన్‌పీవీ ఆధారంగా ఈక్విటీకింద మార్పు చేసేందుకు అనుమతించింది. అలా ఐడియా-వొడాఫోన్‌ నుంచి కేంద్రం వాటా రూపంలో ఆఫర్‌ అందుకుంది.

సంబంధిత పూర్తి కథనం:  ప్రభుత్వం చేతికి వొడాఐడియా!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top