జీవిత కాలం కాల్చకుండా చట్టం.. ఆర్థిక నష్టం వాటిల్లకుండా మాస్టర్‌ ప్లాన్‌!

New Zealand lifetime ban on cigarette sales Check Details Telugu - Sakshi

For Future Generations New Zealand To Ban Cigarettes: రాబోయే తరాల ఆయుష్షు పెంచేందుకు,  ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు న్యూజిలాండ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టీనేజర్లు సిగరెట్లు కొనడానికి, టీనేజర్లకు సిగరెట్లు అమ్మడాన్ని నిషేధిస్తూ చట్టం చేయనుంది అక్కడి ప్రభుత్వం. వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న ఈ చట్టంలోని ‘మెలిక’ ద్వారా అక్కడ యువత జీవితాంతం పొగతాగడానికి దూరం కావడం ఖాయం!.

న్యూజిలాండ్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకురాబోయే యాంటీ స్మోకింగ్‌ బిల్లు వచ్చే ఏడాది చట్టం కానుంది.  14 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు వాళ్లకు సిగరెట్లు అమ్మడాన్ని అక్రమ కార్యకలాపంగా భావిస్తుంది అక్కడి ప్రభుత్వం. అంటే 2008 తర్వాత పుట్టిన వాళ్లెవరూ సిగరెట్లు కొని తాగడానికి, వాళ్లకు ఎవరూ సిగరెట్లు అమ్మడానికి వీల్లేదు. ఈ మేరకు 2027 నుంచి ఈ చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ప్రతిపాదన చేసింది. అంతేకాదు వచ్చే ఏడాది నుంచి ప్రతీ ఏడాది సిగరెట్‌ కొని తాగేందుకు నిర్ధారించిన కనీస వయసును పెంచుకుంటూ పోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  తద్వారా ఆ వ్యక్తి జీవిత కాలం సిగరెట్‌ కొని తాగడానికి.. దుకాణదారులు ఆ వ్యక్తిని సిగరెట్‌ అమ్మడానికి వీల్లేకుండా పోతుంది. 

టార్గెట్‌ విఫలం కావడంతోనే..
యువత ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు తమ జీవిత కాలంలో సిగరెట్‌ కాల్చకుండా.. వాళ్లకు ఎవరూ అమ్మకుండా ఇలా కఠిన చట్టం తీసుకురాబోతోందన్నమాట. గురువారం ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది న్యూజిలాండ్‌ ప్రభుత్వం. నిజానికి స్మోకింగ్‌ అలవాటును తగ్గించే ప్రయత్నాల్లో న్యూజిలాండ్‌ సర్కార్‌ ఎప్పటి నుంచో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్లేయిన్‌ సిగరెట్‌ ప్యాకింగ్‌ తప్పనిసరి చేసిన 17 దేశాల్లో న్యూజిలాండ్‌ ఒకటి. అలాగే పద్దెనిమిదేళ్ల లోపు వాళ్లకు సిగరెట్లు అమ్మడం నిషేధం అక్కడ. అయినప్పటికీ 2025 నాటికి అడల్ట్‌ స్మోకింగ్‌ రేటు కనీసం 5 శాతం తగ్గించాలన్న ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌ ఇలా కఠిన చట్టం ఆలోచన చేసింది. 

స్మోకింగ్‌ అలవాటుతో న్యూలాండ్‌లో సాలీనా ఐదు వేల మంది చనిపోతున్నారు. అంతేకాదు నికోటిన్‌కు అలవాటు పడ్డ పేషెంట్ల కోసం భారీగానే ఖర్చు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. అందుకే యుక్తవయసులోనే అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

వచ్చే ఏడాది చివరికల్లా కొత్త చట్టం సిద్ధం అవుతుంది. ఆ తర్వాత దశలవారీగా అమలు చేస్తారు.  2024 నాటికల్లా.. సిగరెట్‌ స్టోర్ల సంఖ్యను తగ్గించి(8 వేల నుంచి 500కి తగ్గించాలనే ఆలోచనలో ఉంది).. అమ్మకాల్ని తగ్గుముఖం పట్టేలా చేస్తారు.  2025 నుంచి నికోటిన్‌ లెవల్‌ తక్కువ ఉండే సిగరెట్లను మాత్రమే అమ్మాలనే కఠిన నిబంధన అమలు చేయనుంది. ఇక 2027 నుంచి స్మోక్‌ ఫ్రీ జనరేషన్‌ నినాదంతో కఠిన చట్టం అమలు చేస్తారు. 

నిషేధాన్ని ఎలా అమలు చేస్తారు? ఏయే రిటైలర్స్‌ను అమ్మకాలకు దూరంగా ఉంచుతారు? ఎవరికి అనుమతులు ఉంటాయి?.. అనే ప్రణాళిక ప్రత్యేకంగా సిద్ధం చేయనున్నారు. మిగతా వివరాలపై బిల్లు తీసుకొచ్చే టైంలోనే  స్పష్టత ఇవ్వనున్నారు. 

న్యూజిలాండ్‌ ఇంత టఫా?
అఫ్‌కోర్స్‌. కానీ, న్యూజిలాండ్‌ కంటే భూటాన్‌ సిగరెట్‌ నిషేధాన్ని కఠినాతికఠినంగా అమలు చేస్తోందని తెలుస్తోంది. అయితే భారత్‌ నుంచి బ్లాక్‌ మార్కెట్‌ ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేసినట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. 

పక్కాగా అమలు
యువతలో పెరిగిపోతున్న పొగతాగే అలవాటు-మరణాలపై మవోరి తెగ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య నిపుణులతో పాటు మవోరి టాస్క్‌ఫోర్స్‌ ‘లైఫ్‌టైం స్మోకింగ్‌ బ్యాన్‌’ను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇక ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా, రిటైలర్స్‌కు నష్టం వాటిల్లకుండా దశల వారీగా చర్యలతో నష్టనివారణ చేపట్టే దిశగా ప్రయత్నాలు చేయనున్నారు. ఉపాధి కోల్పోకుండా ఆ 1500 స్టోర్లను ప్రత్యామ్నాయ స్టోర్లుగా ప్రభుత్వమే నడిపించనుంది. మరీ ముఖ్యంగా స్మోక్‌ ఫ్రీ జనరేషన్‌ చట్టం ద్వారా ప్రజా ఆరోగ్య, మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఖర్చు చేస్తున్న 3.6 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లను ఆదా చేయాలని భావిస్తోంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top