
కొనుగోళ్లకు ముహూర్తం
10 శాతం తగ్గింపుతో ఊరట
పెరగనున్న కార్లు, బైక్‌ల విక్రయాలు
మెదక్‌జోన్: జీఎస్టీ 2.0 (GST 2.0)సోమవారం నుంచి అమలులోకి రానుంది. దీంతో కార్లు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. వీటిపై 28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గించడంతో ఆ మేరకు ధరలు తగ్గనున్నాయి. జిల్లాలో 21 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించిన షోరూంలు సుమారు 50కి పైగా ఉన్నాయి. వీటితో పాటు ఈ– ఎలక్ట్రానిక్ షోరూంలు విరివిగా ఉన్నాయి. ఏటా జిల్లాలో దసరాకు(Dassahra) సుమారు 1,500 బైకులు, 350 కార్ల కొనుగోళ్లు జరుగుతాయని పలు షోరూంల నిర్వాహకులు చెబుతున్నారు. అయి తే ఈసారి జీఎస్టీ స్లాబులు తగ్గటంతో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
సామాన్య, మధ్య తరగతికి ఊరట
జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తుంది. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు కొంతమేర తగ్గుతాయి. ద్విచక్ర వాహనంపై రూ. 8,000 నుంచి రూ. 20,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అదే కార్ల ధరల్లో రూ. 60,000 నుంచి రూ.1.50 లక్షల వరకు ధర తగ్గనుంది. దీంతో జిల్లాలో ఈ ఏడాది వాహనాల కొనుగోలుదారులకు మొత్తంగా రూ. 5 నుంచి రూ. 6 కోట్ల వరకు ఆదా అవుతుందని షోరూంల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
పెరిగిన ఈ– వాహనాల వినియోగం
కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ శ్లాబులతో సహజంగా అన్ని వాహనాలకు 10 శాతం మేర ధరలు తగ్గుతున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ వాహనాల వాడకం పెరిగి పెట్రోల్ వాహనాలు తగ్గితే కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే ఉద్దేశంతో కేంద్రం మొదటి నుంచి ఈ– వాహనాలకు సుమారు 20 శాతం మేర సబ్సిడీని ఇస్తోంది. ప్రస్తుతం వీటి వినియోగం సైతం జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే వీటిలో బైక్, స్కూటీలు 100 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. అలాగే ఈ– కార్లు సైతం 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేసేవి ఉన్నాయి. ఆయా కంపెనీలు వీటి బ్యాటరీలను బట్టి సర్వీ స్ ఇస్తుండటంతో వినియోగం పెరిగింది.
భారీగా విక్రయాలు జరిగే అవకాశం
సాధారణంగా దసరా పండుగ వేళ కొత్త వాహనాలు కొనుగోళ్లు చేయడం ఆనవాయితీ. ఈ సెంటిమెంట్ ఉన్న వారు కార్లు, ద్విచక్ర వాహనాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకొని మరీ దసరా పండుగ రోజు పొందుతుంటారు. ఈ పండుగ నాటికి తగ్గించిన జీఎస్టీ అమలులోకి రానుంది. దీంతో ఆయా వాహనాల ధరలు తగ్గనున్నాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజలు చూస్తున్నారు. ధరలు తగ్గుతున్న నేపథ్యంలో అదే రీతిలో కొనుగోళ్లు సైతం పెరగనున్నట్లు విక్రయ కేంద్రాల నిర్వాహకులు అనుకుంటు న్నారు. వినియోగదారుల అభిరుచికి తగ్గట్లు కొనుగోళ్లను పెంచేందుకు షోరూంల నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు.