మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల! | Sakshi
Sakshi News home page

మెదడులో చిప్ పనిచేస్తోంది.. నిజమవుతున్న మస్క్ కల!

Published Tue, Feb 20 2024 6:17 PM

Neuralinks First Human Patient Can Control Mouse Through Thinks - Sakshi

న్యూరాలింక్‌ ఇటీవల మనిషి మెదడులో చిప్ అమర్చింది. ఆ చిప్ కలిగిన మనిషి ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నట్లు, వారి ఆలోచనల ద్వారా కంప్యూటర్ మౌస్‌ను నియంత్రించగలుగుతున్నట్లు స్టార్టప్ వ్యవస్థాపకుడు 'ఇలాన్ మస్క్' (Elon Musk) వెల్లడించారు.

మెదడులో చిప్ కలిగిన వ్యక్తి పూర్తిగా కోలుకుంటున్నట్లు మాత్రమే కాకుండా.. పురోగతి కూడా కనిపిస్తోందని తెలిపారు. ఆ వ్యక్తి కేవలం ఆలోచించడం ద్వారా స్క్రీన్ చుట్టూ మౌస్ కదిలించగలడని, వీలైనన్ని ఎక్కువ మౌస్ బటన్ క్లిక్‌లను పొందడానికి ఇప్పుడు న్యూరాలింక్ ప్రయత్నిస్తోందని మస్క్ వెల్లడించారు.

సెప్టెంబరులో హ్యూమన్ ట్రయల్ రిక్రూట్‌మెంట్ కోసం ఆమోదం పొందిన తర్వాత సంస్థ గత నెలలో మొదటిసారి మనిషి మెదడులో చిప్‌ను విజయవంతంగా అమర్చింది. మెదడులోకి ఒక ప్రాంతంలో ఆపరేషన్ చేసి చిప్ అమర్చినట్లు వెల్లడించారు.

మనిషి మెదడులో చిప్ అమర్చడానికి ప్రధాన ఉద్దేశ్యం ప్రజలు తమ ఆలోచనలను ఉపయోగించి కంప్యూటర్ కర్సర్ లేదా కీబోర్డ్‌ను నియంత్రించేలా చేయడమే అని చెబుతున్నారు. అంతే కాకుండా నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటివల్ల కాళ్లు, చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను ఈ చిప్ మెరుగుపరిచే వీలుంది. డిమెన్షియా, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం ఇది ఉపయోగపడుతుంది.

ఇదీ చదవండి: టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి

మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది ఇలాన్ మస్క్ కల. దీని కోసం గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి కావాల్సిన అనుమతులు పొంది మెదడులో చిప్ అమర్చారు. ప్రస్తుతం ఇది సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది.

Advertisement
 
Advertisement