మెడల్స్‌-నజరానా ఓకే.. ట్యాక్సుల కట్టింగ్‌ ఇలా..

Neeraj Chopra And Other Tokyo Olympics Medalists Tax On Prize Money - Sakshi

కనివినీ ఎరుగని రీతిలో భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాల ద్వారా చరిత్ర సృష్టించారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో పాయింట్ల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది మన దేశం. నీరజ్‌ చోప్రా, బజరంగ్‌, మీరాబాయ్‌ చాను, సింధు, భారత హాకీ టీం.. ఇలా పతకాలు తెచ్చిన వీరులను నజరానాలతో ముంచెత్తుతున్నారు. ఈ తరుణంలో వాళ్లకు దక్కబోయే-దక్కుతున్న వాటికి ట్యాక్స్‌ కట్టింగ్‌లు వర్తిస్తాయా?

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌లో సెక్షన్‌ 10(17ఏ) ప్రకారం.. వేటి మీద కోత ఉంటుందో వేటి మీద ఉండదో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) నిర్ణయిస్తుంది. ఇలాంటి విజయాల సమయంలో ఆటగాళ్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నాకే నజరానాలపై ట్యాక్స్‌లు విధించకూడదని నిర్ణయించుకుంది. 1989 నుంచే ఈ చట్టం ఉన్నప్పటికీ.. 2014లో సీబీడీటీ ఆదేశపూర్వకంగా వీటి వివరాలను వెల్లడించింది. ప్రభుత్వాలు అందించే క్యాష్‌ ప్రైజ్‌గానీ మరేయితర రూపమైన నజరానాపైగానీ మెడల్స్ విన్నర్లకు మాత్రమే ట్యాక్స్‌ మినహాయింపు ఉంటుంది. ఒలింపిక్స్‌, కామన్‌ వెల్త్‌ గేమ్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.  

వీళ్లకు నో.. 
అయితే స్థానిక అధికార సంస్థలు, క్రీడా విభాగాలు, పారిశ్రామికవేత్తలు ప్రకటించే నజరానాలపై పన్ను మినహాయింపు ఉండదు. ఈ లెక్కన బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రా(చోప్డా)కు ఆనంద్‌ మహీంద్ర ప్రకటించిన ఎస్‌యూవీ వెహికిల్‌ కోసం 30 శాతం పన్ను ఫీజును తన జేబులోంచి కట్టాల్సి ఉంటుంది నీరజ్‌. ఇక హరియాణా, పంజాబ్‌, మణిపూర్‌ ప్రభుత్వాలు ప్రకటించిన కోట్ల రూపాయల నజరానా మాత్రం ఎలాంటి కట్టింగ్‌లు లేకుండానే నీరజ్‌ చేతికి అందుతుంది. 

చదవండి: వీరులకు బ్రహ్మరథం

హాకీ ఉమెన్‌.. కట్‌
కేవలం ‘విజేతలకు మాత్రమే’ అనే సీబీడీటీ ఆదేశాలు.. మిగతా టాలెంటెడ్‌ ఆటగాళ్లకు విఘాతంగా మారాయి. ఒలింపిక్స్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన భారత మహిళా హాకీ టీం 9 మంది ప్లేయర్లకు హరియాణా సర్కార్‌ రూ.50లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. మెడల్‌ గెలవనందున ఈ డబ్బు నుంచి ట్యాక్స్‌ కట్టింగ్‌లు పోనున్నాయి. కేవలం ప్లేయర్స్‌కే కాదు.. వాళ్ల కోచ్‌కు కూడా ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థల నుంచి ఎలాంటి రివార్డు అందినా.. అదీ కోతకు గురికావాల్సిందేనని చట్టం స్పష్టం చేస్తోంది. 

30 శాతం తప్పదు
ప్లాట్‌ రేట్‌ ప్రకారం.. మినహాయింపులు లేని నజరానాల నుంచి 30 శాతం కోత తప్పనిసరి. కేవలం గెలిచిన వాళ్లే కాదు.. ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అందించే నజరానాలకు ఈ కోత తప్పదు. ఒకవేళ దాతనే ముందుకొచ్చి ఆ చెల్లింపులు భరిస్తే మాత్రం.. ఆటగాళ్లపై భారం పడదు. ఇక విమాన, రైల్వే, బస్సు  ప్రయాణాలంటూ ఆటగాళ్లకు ఉచిత ఆఫర్లను ప్రకటిస్తుంటాయి సంస్థలు. అయితే ప్రభుత్వ-ప్రైవేట్‌ రంగ పరిధిలోని ఏవైనా సరే ప్రయాణాలకు మాత్రమే ఫ్రీ ఆఫర్‌ను ఇస్తాయి. ఫుడ్‌, లగేజీ ప్యాకింగ్‌ తదితర ఛార్జ్‌లపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. ఎంతో కొంత ఛార్జీలు వసూలు చేస్తుంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top